కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు సహా హైదరాబాద్‌లోని పేరున్న విద్యాసంస్థలకి డ్రగ్స్ వినియోగంతో సంబంధాలు వున్నాయనే కోణంలో విచారణ వేగవంతం చేసిన ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ ఈ నెల 16 నుంచి 27 వరకు పది రోజులపాటు సెలవుపై వెళ్లనుండటం అనేక అనుమానాలకి తావిచ్చింది. ఈ డ్రగ్స్ రాకెట్‌లో అనేక మంది పెద్దలు నోటీసులు అందుకోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే అకున్ సబర్వాల్ అకస్మాత్తుగా సెలవుపై వెళ్తున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఈ క్రమంలో తాను సెలవుపై వెళ్లడం గురించి వస్తోన్న ఆరోపణలపై ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ స్పందించారు. 'కేవలం వ్యక్తిగత పనిపై మాత్రమే తాను సెలవులో వెళ్లడం జరుగుతోంది కానీ ఈ కేసు విచారణకి తన సెలవుకి ఏ మాత్రం సంబంధం లేదు' అని తేల్చిచెప్పారు అకున్ సబర్వాల్. 'ఈ కేసు విచారణలో ప్రభుత్వం నుంచి మాకు అన్ని విధాల సహకారం అందుతోందని స్పష్టంచేసిన ఎక్సైజ్ డీజీ... నోటీసులు అందుకున్నంత మాత్రాన్నే అందరూ నిందితులు కారు' అని అభిప్రాయపడ్డారు.
'సంచలనం సృష్టించిన ఈ డ్రగ్స్ రాకెట్ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశాం. మరో 12 మందికి నోటీసులు జారీచేశాం. సినీ ప్రముఖులు, విద్యాసంస్థల పేర్లు ఏవీ బహిర్గతం చేయలేదు' అని అకున్ సబర్వాల్ క్లారిటీ ఇచ్చారు.