న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగానే మొదలయ్యాయి. దళితులపై దాడి అంశం రాజ్యసభలో దుమారం లేపింది. తమ వర్గంపై దాడి జరిగిన అంశాన్ని మాట్లాడనివ్వడం లేదంటూ బీఎస్పీ నేత మాయవతి ఆరోపించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించారు. షహరాన్‌పూర్‌లో దళితులపై జరిగిన దాడి ఘటనను ఆమె లేవనెత్తారు. అయితే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక లోక్‌సభలోనూ దుమారం రేగింది. అనేక అంశాలపై సభ్యులు నినాదాలు చేశారు. రైతుల సమస్యలు, గోవధ అంశాలపై నినాదాలు మారుమోగాయి. దాంతో రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఇక లోక్‌సభను రేపటికి వాయిదావేశారు.
ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ఓడిపోవడం వల్లే మాయావతి ఆందోళనకు గురవుతున్నదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. ఇది సభాపతిని అవమానపరచడమే అని ఆయన అన్నారు. చైర్‌కు సవాల్ చేసిన మాయావతి క్షమాపణలు చెప్పాల్సిందే అని నఖ్వీ డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తానని చెబుతూ మాయావతి తన చేతిలో ఉన్న కాగితాలను నేలకు విసిరికొట్టి ఆగ్రహాంగా సభ నుంచి వాకౌట్ చేసింది. ఆ టైమ్‌లో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో నినాదాలు వినిపించాయి. అన్ని సమస్యలను ప్రభుత్వం చర్చించాలని ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ అన్నారు. నరికివేత, రైతుల మరణాలు, దళితులపై దాడులు లాంటి అంశాలను సభలో చర్చించాలని డిమాండ్ చేశారు.