నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 9 స్థానాలు గెలవడం కార్యకర్తల శ్రమకు నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం యువత బలిదానాలు తనను కలచివేశాయని, అందుకే తాను టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ సాదన కోసం టీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. సమర్ధుడైన ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనుకున్నంతగా చేపట్టడం లేదని, అదే మూడేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలతో సీఎం కేసీఆర్ దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారని పోచారం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ 110 స్థానాల్లో బలంగా ఉందని మంత్రి పోచారం స్పష్టం చేశారు. వచ్చే 20 ఏండ్ల వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 35 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని..40 వేల కోట్ల రూపాయలు సంక్షేమ రంగానికి ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు విసృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు, ప్రజలకు సూచించారు. తెలంగాణ వస్తే శాంతిభద్రతల సమస్య వస్తదని దుష్ప్రచారం చేశారన్నారు. అందరం కలిసి తెలంగాణ అభివృద్ధికి కలిసి నడుద్దామని మంత్రి పోచారం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్త, మేయర్ ఆకుల లలిత, జిల్లా కన్వీనర్ ఈగ గంగారెడ్డి, టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa