భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పై కొంతమంది ముస్లిం నెటిజన్లు మండిపడుతున్నారు. ఫేస్‌బుక్ లో కైఫ్ పెట్టిన ఒక ఫొటో పట్ల వారు అభ్యంతరం తెలుపుతున్నారు. ముస్లిం మతాచారాలకు విరుద్ధంగా కైఫ్ వ్యవహరించాడని వారు అంటున్నారు. ఈ మేరకు కైఫ్ ఫొటో కింద ఈ మేరకు వారు కామెంట్లు పెడుతున్నారు.
ఇంతకీ కైఫ్ చేసిన అపచారం ఏమిటి? అంటే.. చెస్ ఆడుతూ ఒక ఫొటోను పెట్టాడు. అంతే.. కొంతమంది నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు. వారి వాదన ఏమనగా.. ముస్లిం మతాచారం ప్రకారం చదరంగం ఆడకూడదు! ఖురాన్ లో ఈ మేరకు లిఖితం అయ్యిందని.. చదరంగం ఆడకూడదనేది ఇస్లాం నిబంధన అని వారు అంటున్నారు. మతాచారానికి విరుద్ధంగా కైఫ్ చదరంగం ఆడుతూ ఫొటో పెట్టడం తప్పు అని వారు కామెంట్లు పెట్టారు.
అయితే వీటిపై కైఫ్ స్పందించలేదు. ఇటీవలే మరో భారత క్రికెటర్ షమీ విషయంలో కొందరు సంప్రదాయ వాదులు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు కైఫ్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం.. కైఫ్ ను సమర్థించారు. మెదడు పెట్టే ఆట ఆడకూడదనేది మత నిబంధనా? అని వారు ప్రశ్నించారు. అంటే దీని ప్రకారం.. మనిషి ఆలోచించనీయకుండా అడ్డు పడటమే మతం పనా? అని కొందరు ముస్లిం నెటిజన్లే ప్రశ్నించడం గమనార్హం.