సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలాని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి ఫైర్ అయ్యారు. జైట్లీని బూతులు తిట్టాల్సిందిగా కేజ్రీవాల్ తనకు చెప్పారని ఆయన ఆరోపించారు. జులై 20 కేజ్రీవాల్‌కు రాసిన ఉత్తరంలో ఈ విషయం వెల్లడించిన రాంజెఠ్మలానీ.. తాజాగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కూడా లేఖ రాశారు. మే 17న కోర్టు విచారణలో భాగంగా జెఠ్మలానీ తనపై అభ్యంతర వ్యాఖ్య చేయడాన్ని అరుణ్ జైట్లీ తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై రూ.10 కోట్లకు కేజ్రీవాల్‌పై జైట్లీ మరో పరువు నష్టం దావా వేశారు. నిజానికి తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల్లో కేజ్రీవాల్ మరింత అభ్యంతరకర భాష వాడినట్లు కూడా జెఠ్మలానీ వెల్లడించారు. సీనియర్ లాయర్ చెప్పిన ఈ సీక్రెట్స్ ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మరిన్ని చిక్కుల్లో పడేశాయి. అటు జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో కేజ్రీవాల్‌కు న్యాయవాదిగా ఉన్న జెఠ్మలానీ.. కొన్ని రోజుల కిందటే తప్పుకున్నారు.