హైదరాబాద్ : నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ శివారులోని శామీర్‌పేటలో గల యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ 49 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 406 మంది విద్యార్థులకు న్యాయ శాస్ర్త పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, యూనివర్సిటీ చాన్స్‌లర్, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ తో పాటు లా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. న్యాయ విద్య బోధనలో నల్సార్ లా యూనివర్సిటీ జాతీయస్థాయిలో ఇప్పటికే ఎంతో మంచి పేరు తెచ్చుకుందని తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటైన రెండు దశాబ్దాల్లోనే ఎంతో మంచి పేరు తెచ్చుకుందన్నారు. నల్సార్ ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో నల్సార్ ముందుందన్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ కోర్సులు ప్రవేశపెట్టడంలో నల్సార్ దేశంలోనే మొదటిది అని తెలిపారు. లీగల్ కోర్సులో సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు సీఎం. రాష్ర్టంలో న్యాయవిద్య కోర్సులు, కార్యక్రమాలు విస్తరించాలని నల్సార్ ను కోరుతున్నానని తెలిపారు. ఉన్నత విద్య కోసం మరిన్ని ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు భవనాల నిర్మాణం కోసం 22 ఎకరాల భూమిని నల్సార్ కు కేటాయిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. నల్సార్ క్యాంపస్ ఆధునీకరణకు ప్రభుత్వ సహకారం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. బంగారు తెలంగాణలో నల్సార్ పాలుపంచుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.