హైదరాబాద్ లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిని డిప్యూటీ సీఎం మహముద్ అలీ, వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ ఆస్పత్రిలో 3 అధునాతన యంత్రాలను మంత్రులు ప్రారంభించారు. రేడియో థెరపీ, డిజిటల్ మోనోగ్రఫీ, బ్లడ్‌బ్యాంక్ కంపోనెట్స్ యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చు అవుతాయన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన యంత్రాలతో పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నీలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కొందరు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాలు చేసే అధికారులు, వైద్యులపై క్రిమినల్ కేసులు పెడుతామని హెచ్చరించారు. అవకతవకలకు పాల్పడిన వారిపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని మంత్రి చెప్పారు.