ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భయపడి ఢిల్లీని వీడిన గుర్‌ మెహర్‌ కౌర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 02:00 AM

-సెహ్వాగ్‌ ట్వీట్‌ నా గుండెను బద్దలు చేసింది
-నన్ను నిందించొద్దు : బాలీవుడ్‌ హీరో
-ఏబీవీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయను

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులకు భయపడి కార్గిల్‌ అమర వీరుడి కుమార్తె, ఢిల్లీ విద్యార్థిని గుర్‌ మెహర్‌ కౌర్‌ ఢిల్లీని వీడారు. ఈ విషయాన్ని ఆమెతో మాట్లాడిన అనంతరం వాయిస్‌ ఆఫ్‌ రామ్‌ పేరిట ట్విట్టర్‌ ఖాతాను నిర్వహిస్తున్న రామ్‌ సుబ్రమణియన్‌ స్పష్టం చేశారు. తాను మెహర్‌తో మాట్లాడానని, ఆమె నిజంగా ఎంతో భయపడిందని, ఆమె ఢిల్లీని వీడిందని తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేస్తూ, ఈ దేశానికి చెందినవారిగా ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. అంతకుముందు గుర్‌ మెహర్‌ కౌర్‌, తన ట్విట్టర్‌లో పలు వ్యాఖ్యలు చేస్తూ, తనకు ఎదురైన బెదిరింపులను ప్రస్తావించారు. అత్యాచారం చేస్తామని అన్న వ్యక్తి, ఎలా చేస్తారో వివరించి ట్వీట్‌ పెడితే, భయంతో వణికిపోయానని చెప్పారు. ర్యాలీలో పాల్గొనడం లేదని అన్నారు. తనను ఒంటరిగా వదిలివేయాలని వేడుకున్నారు. తన నిర్ణయంపై ప్రశ్నలు సంధించాలంటే రామ్‌ సుబ్రమణియన్‌ ను అడగాలని చెప్పారు. బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీకి వ్యతిరేకంగా గళమెత్తిన ఆమెపై సెలబ్రిటీల నుంచి క్రీడా ప్రముఖులు, సాధారణ పౌరుల వరకూ ట్వీట్లతో విమర్శల వర్షాన్ని కురిపించగా, పలువురు బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్‌ మెహర్‌ కౌర్‌, తన తండ్రి మరణంపై చేసిన ట్వీట్‌ పై, సెహ్వాగ్‌ వ్యంగ్యంగా స్పందించిన నేపథ్యంలో, సెహ్వాగ్‌ ట్వీట్‌ ను సమర్థించిన బాలీవుడ్‌ హీరో, హైవే ఫేమ్‌ రణదీప్‌ హుడాపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో, వివరణ ఇచ్చాడు. సెహ్వాగ్‌ ఓ జోకు వేస్తే, తాను నవ్వానని, అందుకని తనను నిందించడం సరికాదని వాపోయాడు. కేవలం నవ్వినందుకే తనను సామాజిక మాధ్యమాల్లో ఉరితీసినంత పని చేస్తున్నారని చెప్పాడు. ఓ యువతిని బెదిరించడం సబబని తాను ఎన్నడూ చెప్పలేదని, చెప్పబోనని, ఆమెకు వస్తున్న ట్వీట్లలో సైతం బెదిరింపు ట్వీట్లు అతి తక్కువగానే ఉండవచ్చని చెప్పాడు. తాను తప్పనుకున్న విషయమై నిరసన తెలిపే హక్కు గుర్‌ మెహర్‌ కు ఉందని రణదీప్‌ హుడా వ్యాఖ్యానించాడు. తన ట్వీట్‌ను గుర్‌ మెహర్‌ కు ట్యాగ్‌ చేయలేదన్న విషయాన్ని మీడియా విస్మరించిందని చెప్పాడు. బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీకి వ్యతిరేకంగా ప్రచారం తలపెట్టిన ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్‌ అమరవీరుడి కుమార్తె గుర్‌ మెహర్‌ కౌర్‌ వెనక్కి తగ్గారు. ఈ నెల 22న రామ్‌ జాస్‌ కాలేజీలో జరిగిన వివాదం అనంతరం ఏబీవీపీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టిన ఆమె, ఇకపై తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేస్తూ, ర్యాలీలో తాను పాల్గొనబోవడం లేదని తెలిపారు. ఈ ర్యాలీ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ర్యాలీలో పాల్గొనాలని కోరారు. టీమిండియా మాజీ బ్యాట్‌‌స మెన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ చేసిన ట్వీట్‌ తన గుండెలను బద్దలు చేసిందని ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్‌ మెహర్‌ కౌర్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఏబీవీపీని ఉద్దేశిస్తూ, నా తండ్రిని పాకిస్థాన్‌ చంపలేదు, యుద్ధం చంపింది అంటూ గుర్‌ మెహర్‌ సోషల్‌ మీడియాలో పోస్‌‌ట పెట్టిన తర్వాత సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. రెండు ట్రిపుల్‌ సెంచరీలను నేను చేయలేదు నా బ్యాట్‌ చేసింది అంటూ వీరూ ట్విట్టర్‌లో స్పందించాడు. ఈ నేపథ్యంలో గుర్‌ మెహర్‌ మాట్లాడుతూ, సెహ్వాగ్‌ ట్వీట్‌ చూడగానే తనకు ఎంతో బాధ కలిగిందని చెప్పింది. చిన్నప్పటి నుంచి సెహ్వాగ్‌ ను చూస్తున్నానని, తనను ఉద్దేశిస్తూ ఆయన ఈ విధంగా ట్వీట్‌ ఎందుకు చేశారో అని వ్యాఖ్యానించింది. గుర్‌ మెహర్‌ కౌర్‌ తండ్రి కెప్టెన్‌ మణ్‌ దీప్‌ సింగ్‌ 1999 కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa