-ప్రకటించిన అమెరికా కంపెనీ
-కోర్టుకు శ్రీనివాస్ హంతకుడు
-మరణశిక్ష ఖాయమంటున్న నిపుణులు
-భారతీయులారా భయమొద్దు
-ధైర్యంగా అమెరికా రండి : హీరో గ్రిల్లోట్
న్యూయార్‌క: అమెరికాలో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకు గురైన విషయం తెలిసిందే. శ్రీనివాస్ పనిచేసే గార్మిన్ సంస్థ ఆయన భార్య సునయనకు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ హెచ్1బి వీసాతో అమెరికాకు వెళ్లారు. ఆయన వద్దకు వెళ్లేందుకు సునయన హెచ్4 వీసా తీసుకొని వెళ్లారు. అయితే ఇప్పుడు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ వీసా తీసుకుని ఉంటున్న సునయన తిరిగి అమెరికా వెళ్లేందుకు వీలుండదు. దీంతో సునయన రెండు రోజుల క్రితం తాను మళ్లీ అమెరికా వచ్చేందుకు సాయపడాలని గార్మిన్ కంపెనీని కోరారు. అమెరికాలో శ్రీనివాస్ కలలను నెరవేర్చేందుకు తాను ఎంచుకున్న రంగంలో విజయవంతం అయ్యేందుకు సాయపడాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సదరు కంపెనీ ఆమె అమెరికా వచ్చేందుకు వీలుగా తగిన వీసా సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు జరుపుతోంది. సదరు కంపెనీకి చెందిన ఇమ్మిగ్రేషన్ అధికారులతో పాటు ఆమెకు ఉచితంగా న్యాయసహాయం అందించేందుకు బ్రయాన్ కేవ్ అనే న్యాయసంస్థ సహా పలు సంస్థలు ముందుకు వచ్చాయి. శ్రీనివాస్ భార్యకు అన్ని రకాలుగా సాయం చేస్తామని ఆ కంపెనీ పేర్కొంది. ఆమె తమ దేశంలోనే ఉండి పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని గార్మిన్ సంస్థ పేర్కొంది. కన్సాస్ లోని బారులో భారత యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్ ను కాల్చిచంపిన కేసులో నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ ను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఘటన తరువాత ఆడమ్ ను అరెస్‌ట చేసిన పోలీసులు, అతనిపై ఇప్పటికే వీడియో ఫుటేజ్ సహా, పక్కా సాక్ష్యాలు సేకరించారు. అతనే స్వయంగా కాల్పులకు పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉండటం విచారణ వేగంగా జరిగేందుకు ఉపకరిస్తుందని న్యాయ వర్గాలు వెల్లడించాయి. హత్య, హత్యాయత్నం కేసులను ఆడమ్ పై రిజిస్టర్ చేసిన పోలీసులు, సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో ఆడమ్ కు మరణదండన ఖాయమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. అమెరికాలోని కాన్సస్‌లో తెలుగువాడైన శ్రీనివాస్ కూచిభొట్లపై జరిగిన కాల్పుల తర్వాత బిక్కుబిక్కుమంటున్న భారతీయులకు రియల్ హీరో గ్రిల్లోట్ అభయహస్తం ఇచ్చే ప్రయత్నం చేశాడు. భారతీయుల్లో గూడుకట్టుకున్న భయాందోళనలను పారదోలే ప్రయత్నం చేశాడు. గత బుధవారం ఓ బార్‌లో నేవీ మాజీ ఉద్యోగి ఒకరు శ్రీనివాస్, అతడి స్నేహితుడు అలోక్ మాదసానిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందాడు. కాల్పులు జరుపుతున్న సమయంలో వారిని రక్షించడానికి ఎదురెళ్లిన అమెరికన్ గ్రిల్లోట్‌కు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. తూటాలకు ఎదురెళ్లిన గ్రిల్లోట్ రియల్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రిల్లోట్‌ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు జంపాల చౌదరి, సతీష్ వేమన తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రిల్లోట్ మాట్లాడుతూ కాన్సస్ ఘటనతో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఉపాధి, ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చిన భారతీయులు భయపడవద్దు. ప్రస్తుత ఘటనలు తాత్కాలికమే. ఎవరు ఎక్కడైనా ఉపాధి పొందే అవకాశం ఉంది. అమెరికా రావడం మానుకోవద్దు అని పేర్కొన్నాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా శ్రీనివాస్‌ను కాపాడాలనుకున్నానని, ఏదో ఒకటి చేయాలని అనిపించే వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేశానని ఆనాటి ఘటనను గ్రిల్లోట్ గుర్తు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్‌డ ట్రంప్ సీనియర్ సలహాదారు కెల్యానే కాన్వే అనే మహిళ శ్వేత సౌధంలో ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికన్లు ఎంతో పవిత్రంగా చూసే శ్వేతసౌదంలో డొనాల్‌డ ట్రంప్ వర్గమంతా ఓ ఫొటో దిగుతుండగా కెల్యానే కాన్వే మాత్రం అమార్యగా ప్రవర్తించారు. ఓ వైపు ట్రంప్తో పాటు ఆ దేశ అత్యున్నత అధికారులు అక్కడే ఉండగా మరోవైపు శ్వేత సౌదంలోని సోఫాపై తన షూ కూడా తీయకుండానే మోకాళ్లపై కూర్చుంది ఆమె. అనంతరం ఏదో ఘన కార్యంచేసినట్లు నవ్వుతూ కనిపించారు. ఆమె చేతిలో సెల్ ఫోన్ కూడా ఉంది. ఈ విషయాన్ని అక్కడున్న వారు ఎవ్వరూ గమనించలేదేమో. అక్కడుకున్న ఓ కెమెరామెన్ మాత్రం గమనించి ఓ ఫొటో తీశాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వైట్ హౌస్లో ఆమె తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కనీస మర్యాద లేకుండా తన షూ కూడా తొలగించకుండా అతిథులు సేద తీరే సోఫాలో అలా కూర్చోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పలు దేశాల అధికార ట్విట్టర్ ఖాతాల్లో కూడా ఈ ఫొటో దర్శనమిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa