వాహనదారులారా..డేంజర్..ఆ.. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుందిలే అనుకోవద్దు. రాంగ్ సైడ్‌లో వెళ్దాం.. పట్టుకుంటే చూద్దామనే ధోరణే వద్దు. ఇతరత్రా ట్రాఫిక్ నిబంధనలపైనా అప్రమత్తత అవసరం. ప్రతి దానికి లెక్కుంది..ఉల్లంఘనలను ఇక జరిమానాలతో సరిపెట్టరు. ప్రతి తప్పునకు నిర్దేశించిన పాయింట్లు విధిస్తారు. అలా 12 పాయింట్లు దాటితే లైసెన్సు రద్దే. ఉదాహరణకు ఓ ఆరుసార్లు రాంగ్ సైడ్‌లో వెళ్లినా.. ఓ నాలుగు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినా ఇంతే సంగతులు.
లైసెన్సు ఉండదు సరి కాదా.. ఆ తర్వాత వాహనాలు నడుపుతూ కనిపిస్తే జైలే. ఉల్లంఘనలకు పాయింట్లు పడే విధానం మంగళవారం (ఆగస్టు 1) నుంచి అమలులోకి వస్తోంది. గ్రేటర్ ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా, పోలీసు శాఖలు పాయింట్ల విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నాయి. దీనికి ఇరు శాఖల ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేసి కొత్త వ్యవస్థను రూపొందించారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ ఖచ్చితమైన నిబంధనల ప్రకారం నడిచేలా చూసేందుకు దేశంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని అమల్లోకి తేస్తున్నారు. ‘‘ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమలవుతోంది. ఇక్కడా పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగేలా చూడవచ్చు. రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది’’ అని అధికారులు అంటున్నారు.
ఉల్లంఘనలు..పాయింట్లు
ఆటోలో సీట్ల కంటే అదనంగా ఎక్కిస్తే 1
గూడ్స్ వాహనాల్లో ప్రయాణికుల్ని తరలిస్తే 2
సీట్ బెల్ట్, హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే 1
రాంగ్ రూట్ లో వాహనం నడిపితే 2
నిర్దేశత వేగాన్ని మించితే 3
ర్యాష్ డ్రైవింగ్/సెల్ ఫోన్ డ్రైవింగ్/ సిగ్నల్ జంపింగ్ 2
రేసింగ్ 3
మద్యం తాగి వాహనం నడిపితే( ద్విచక్ర వాహనం) 3
మద్యం తాగి వాహనం నడిపితే( నాలుగు చక్రాల వాహనం) 4
డ్రంకన్ డ్రైవింగ్(బస్సు/ క్యాబ్/ ఆటో) 5
వాహనం నడుపుతూ చైన్ స్నాచింగ్, దోపిడీలకు పాల్పడితే 5
హైవేలో అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం,రోడ్డు భద్రత ఉల్లంఘన 2
బీమా పత్రాలు లేకపోతే 2
అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే 2