ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్నేహితులతో కలసి పక్కా ప్రణాళిక ప్రకారమే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2017, 10:15 AM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటన కొత్త మలుపు తిరిగింది. ఈ థ్రిల్లర్‌కి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు విక్రమ్ గౌడే తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. స్నేహితులతో కలసి పక్కా ప్రణాళిక ప్రకారమే తనపై విక్రమ్ కాల్పులు జరిపించుకున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా భార్య షిపాలీతో సహా ఒకే స్టోరీని తిప్పి తిప్పి పోలీసులకు చెప్పారు. అయితే అన్నికోణాల్లో విచారించిన పోలీసులు విక్రమ్ పక్కా ప్రణాళిక ప్రకారమే కాల్పుల డ్రామాకు తెరతీశారని నిర్ధారించారు.


పీకల్లోతు ఆర్థిక ఇబ్బందులు, అప్పులిచ్చిన వాళ్లనుంచి పెరుగుతున్న ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికే విక్రమ్ ఈ కాల్పుల డ్రామా ఆడినట్లు పోలీసులు చెబుతున్నారు. తనపై హత్యాయత్నం జరిగితే తనకు ప్రాణహాని ఉందని తెలిసి కుటుంబం కూడా దగ్గరవుతుందని విక్రమ్ భావించినట్లు పోలీసులు అంటున్నారు. అందుకనే తనపై సీరియస్ దాడి జరిగిందన్న సీన్ క్రియేట్ చేశారు. కానీ విక్రమ్ ప్లాన్ బోల్తా కొట్టింది. మొత్తం 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తానికి అసలు కారణం తెలుసుకున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సమాచారం. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.


సినిమా, వ్యాపార, రాజకీయ రంగాలు విక్రమ్‌కు కలిసిరాలేదు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు. వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులు కరిగిపోయాయి. తండ్రి ముఖేస్ గౌడ్ కూడబెట్టిన విలువైన ఆస్తులు తన బంధువు పేరుతో ఉండటాన్ని విక్రమ్ జీర్ణించుకోలేకపోయినట్లు సమాచారం. అప్పులిచ్చిన వాళ్ల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక, వాళ్ల నుంచి తప్పించుకోవడానికి తనకున్న పాతపరిచయాలతో అనంతపురానికి చెందిన ముగ్గురుతో భేరం కుదుర్చుకున్నాడు. ఆ ముగ్గురూ 27న ఉదయం హైదరాబాద్ చేరుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో మకాం వేశారు. విక్రమ్ ఆ రోజు రాత్రి వరకు వారితోనే గడిపి ఇంటికి చేరుకున్నారు. దగ్గర్లో ఉన్న గుడికి బ్రహ్మ ముహూర్తంలో వెళ్దామని, సిద్ధంగా ఉండమని భార్యకు చెప్పారు.


పథకం ప్రకారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అనంతపురం నుంచి వచ్చిన ముగ్గరు వ్యక్తులు విక్రమ్ ఇంట్లోకి చొరబడ్డారు. అయితే కాల్పులు జరిపింది మాత్రం వారు కాదని పోలీసులు అంచనా వేస్తున్నారు. విక్రమ్ తనంతట తానే కాల్చుకుని ఉంటారని భావిస్తున్నారు. ఎందుకంటే వచ్చిన వ్యక్తులు కాల్పులు జరిపితే తుపాకి నుంచి వచ్చిన బుల్లెట్ విక్రమ్ శరీరం నుంచి బయటికి వచ్చి వెనుకన ఉన్న వస్తువుకో గోడకో తగలాలి. కానీ అలాంటి ఆనవాళ్లు క్లూస్ టీంకి లభించలేదు. విక్రమ్ మొదట కుడిచేత్తో ఎడమ భుజాన్ని కాల్చుకున్నారని, అప్పుడు బుల్లెట్ భుజానికి రాసుకుంటూ నేలను బలంగా ఢీకొందని.. తరవాత ఎడమచేత్తో కుడి భుజాన్ని కాల్చుకోగా తుపాకీ గురితప్పి బుల్లెట్ కడుపులోకి దూసుకెళ్లిందని పోలీసులు అంచనాకు వచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com