ట్రాఫిక్ ఉల్లం‘ఘనుల’ కోసం ఇక ప్రత్యేకంగా పాయింట్లు వడ్డించనున్నారు. ఈ సరికొత్త విధానం మంగళవారం నుంచి మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అమల్లోకి వచ్చింది. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వాహనదారులు ఉల్లంగనలు 12 పాయింట్లు చేరితే, ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. రెండేళ్లలో మరోసారి 12 పాయింట్లు నమోదైతే.. మరో రెండేళ్ల పాటు సస్పెండ్ చేస్తారు. మూడో దఫా దాటితే ప్రతిసారి మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తారు. లెర్నింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లకైతే 5 పాయింట్లు దాటితే రద్దు చేస్తారు.
మద్యం తాగి వాహనం నడిపితే టూ వీలర్‌కి 3 పాయింట్లు, ఫోర్ వీలర్‌కి 4 పాయింట్లు.. బస్, క్యాబ్‌కి 5 పాయింట్లు నమోదు చేస్తారు. సిగ్నల్ జంప్‌కి 2 పాయింట్లు, అతివేగానికి 3 పాయింట్లు, రేసింగ్ చేసే వాహనదారులకు 3 పాయింట్లు, ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లు నమోదవుతాయి. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుంటే 1 పాయింట్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే 2 పాయింట్లు నమోదు చేస్తారు.
పాయింట్ డ్యూటీలో ఉండే అధికారులు రోడ్లపై వాహనాలను ఆపి పీడీఏ మిషన్ల ద్వారా పాయింట్లు ఇస్తారు. అయితే, కెమెరాల ద్వారా షూట్ చేసి, ఆర్టీఏ డేటాబేస్‌లో ఉన్న చిరునామా ఆధారంగా ఈ–చలాన్ పంపే విధానం అమల్లో ఉన్నా.. ప్రస్తుతానికి స్పాట్ ద్వారానే పాయింట్లు కేటాయించాలని నిర్ణయించారు.
ఒక వ్యక్తి వాహనాన్ని మరొకరు తీసుకువెళ్ళి ఉల్లంఘనకు పాల్పడితే.. అది ఆ వాహనం యజమానికి ఫెనాల్టీ పాయింట్లు పడతాయి. సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేస్తున్న వారు వాటి రిజిస్ట్రేషన్లను తమ పేరిట మార్చుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లోనూ వాహనం నెంబర్ ఆధారంగా పెనాల్టీ పాయింట్స్ విధిస్తే అవి దాని పాత యజమానికి వర్తిస్తాయి. పోలీసులు ఈ సమస్యలు గుర్తించి, ప్రస్తుతం స్పాట్ చలాన్ విధానంలోనే ఈ పాయింట్లు విధించాలని నిర్ణయించారు.