-బస్సుయాజమాన్యం నుంచే రాబట్టి ఇవ్వాలి
-ఇలా చేయకపోతే ప్రైవేటు బస్సు యాజమాన్యాలు మరింత నిర్లక్ష్యం చేస్తాయి
-బాధితులను పరామర్శించిన జగన్
నందిగామ, మేజర్‌న్యూస్ : బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బస్సు యాజమాన్యాల నుంచే నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారని పేర్కొ న్నారు. లేదంటే ఏదో ఒక రోజు అందరి కుటుంబాలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలకు పోకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వం, పోలీసులు, మీడియా ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయిన వారి ప్రాణాలు తీసుకురాలేకపోయినా వారి కుటుంబాలు మనోధైర్యంగా ఉండేం దుకు అండగా నిలవాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. ఇలాంటి యాజమాన్యాలకు మద్దతు ఇవ్వకూడదని చెప్పారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద దివాకర్ ట్రావెల్‌స బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిదిమందికిపైగా చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. మృతదేహాలను నందిగామ ఆస్పత్రికి తరలించగా ఘటన వివరాలు తెలుసుకొని బాధితులను పరామర్శించేందుకు వై.స్.జగన్ ఆస్పత్రి వద్దకు వెళ్లగా అక్కడ టీడీపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ చనిపోయినవారిపట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఆస్పత్రిలోకి వెళ్లారు. కలెక్టర్ అహ్మద్‌బాబును అడిగి వివరాలు తెలుసుకు న్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడి యాతో మాట్లాడుతూ ప్రమాద తీవ్రత, అందులోని లోపాలు, ప్రభుత్వం అనుస రించిన తీరు, నష్టపరిహారం తదితర అంశాలపై నిప్పులు చెరిగారు. బస్సు ప్రమాదంలో చనిపోయినవారికి చంద్రన్న బీమాకింద ఆంధ్రప్రదేశ్ వారికైతే రూ.3లక్షలు, తెలంగాణ ఇతర ప్రాంతాలవారికైతే రూ.2లక్షలు నష్టపరిహారం ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని అస్సలు అంగీకరించేది లేదన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్‌కు చెందిన యాజమాన్యం నుంచి కనీసం రూ.20 లక్షలు నష్ట పరిహారం బాధితుల కుటుంబాలకు ఇప్పించాలని కోరారు. అలా చేయకుంటే బస్సు యాజమాన్యాలు మారవని ఇప్పుడు నిర్లక్ష్యంగా వదిలేస్తే ఏదో ఒక రోజు మన కుటుంబ సభ్యులు, మన పిల్లలు, మన భార్యలు కూడా ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. మానవతా హృదయంతో ఆలోచించండని కోరారు. పెద్ద మనసులతో ఆలోచించాలని, తప్పు చేసినవారిని ప్రశ్నించాలని ఆయన అన్నారు. ప్రతి పోలీసు సోదరుడు, విలేకరి, ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో మానవత్వంతో ఆలోచించాలన్నారు. చనిపోయిన బస్సు డ్రైవర్‌కు పోస్టుమార్టం చేయకపో యినా చేశామంటున్నారని జగన్ ఆక్షేపించారు. డ్రైవర్ తాగి తోలాడ లేదా అని ప్రశ్నిస్తే పోస్టు మార్టం చేయలేదని డాక్టర్లు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్‌కు పోస్టు మార్టం కూడా చేయకుండానే మృతదేహాన్ని ప్యాక్ చేశారన్నారు. రెండో డ్రైవర్ ఏమయ్యాడని అడిగితే వచ్చి వెళ్లాడని చెబుతున్నారని జగన్ ఆక్షేపించారు. రెండో డ్రైవర్ వెళ్లిపోయాడా వెళ్లగొట్టారా అని ప్రశ్నించారు. అతడి దగ్గర లైసెన్‌స ఉందా లేదా ఒక వేళ లైసెన్‌స ఉంటే, తాగి ఉండకుంటే అతడిని ఇక్కడే ఉంచేవారు కదా అని నిలదీశారు. కానీ పంపించారంటే అతడు ఈ రెండింట్లో ఏదో ఒక లోపం కలిగి ఉండి ఉండొచన్నారు. ఇదంతా ఆలోచి స్తుంటే ప్రభుత్వం పెద్ద కుట్రనే చేస్తోందని విమర్శించారు. ఇప్పుడున్న రెండో డ్రైవర్‌ను పంపించేసి కొత్త డ్రైవర్‌ను తీసుకొచ్చి ఇతడే నడిపాడని చెబుతారని జగన్ ఆరోపించారు. ఒక పద్థతి ప్రకారం బస్సు యాజమాన్యాన్ని రక్షిస్తారని ఆయన విమర్శించారు. ఏడాదికిందట కేసినేని, అంతకుముందు దివాకర్ ట్రావెల్‌స, ఇప్పుడు దివాకర్ ట్రావెల్‌స ఈ యాజమాన్యం టీడీపీ ఎంపీలది పేర్కొన్నారు. అందుకే చంద్రబాబు దగ్గరుండి మద్దతిస్తున్నారని విమర్శించారు. అందుకే వారికి రూల్‌స ఉండవని, ఒక పర్మిట్‌తో ఒకే చోట రెండు మూడు బస్సులు, రెండు మూడు రూటుల్లో తిప్పుతున్నారని విమర్శించారు. స్టేజ్ క్యారియర్‌కు పర్మిషన్ లేకున్నా ఆపేసి ప్యాసింజర్లను ఎక్కించుకుంటున్నారని పేర్కొన్నారు. లైసెన్‌స పట్టించుకోరని ఈ బస్సు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో దెబ్బతిన్న బస్సును చూస్తే తెలుస్తోందన్నారు. అంతపెద్ద రోడ్డుపై ఎదురుగా వాహనం వచ్చే అవకాశం లేదన్నారు. నాకు తెలిసి ప్రమాద సమయంలో బస్సు 150 కిలో మీటర్ల వేగంలో ఉండి కల్వర్టు కోడను ఢీకొట్టి 150 అడుగులు దూరం గాల్లో ప్రయాణించి కల్వర్టు అవతలి గోడను ఢీకొట్టిందన్నారు. కచ్చితంగా డ్రైవర్ తాగి ఉండి ఉంటాడని ఆయన పేర్కొన్నారు. అందుకే చనిపోయిన డ్రైవర్‌కు పోస్టు మార్టం నిర్వహించలే దన్నారు. రెండో డ్రైవర్‌ను అరెస్టు చేయలేదన్నారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనకు కారణమైన వారిని కాపాడే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. పోలీసులు ఈ విషయంలో ఆలోచించాల్సి ఉందన్నారు. లేదంటే ఇలాంటి ఘటనలకు ఎవ్వరం కూడా మినహాయింపు కాకుండా పోతారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa