హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ కాల్పుల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేధించామని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సీపీ మీడియాకు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు వివరాలు వెల్లడించారు. విక్రమ్‌గౌడ్ పక్కా ప్రణాళిక ప్రకారమే కాల్పులు జరిపించుకున్నారని పేర్కొన్నారు. కాల్పుల ఘటనలో 8 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. కేసులో మొత్తం 9 మందిని నేరస్థులు, అనుమానితులుగా గుర్తించామని చెప్పారు. ఇందులో విక్రమ్‌గౌడ్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే విక్రమ్‌గౌడ్‌ను అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. విక్రమ్‌గౌడ్‌తో కలిపి ఆరుగురు నేరస్థులు.. నందకుమార్, షేక్ అహ్మద్, రయీస్‌ఖాన్, బాబూజాన్, గోవిందరెడ్డిలు పోలీసుల కస్టడీలో ఉన్నారని తెలిపారు. మరో ఇద్దరు.. వెంకటరమణ, గౌస్ పరారీలో ఉన్నారని వెల్లడించారు. నిందితులు అనంతపురం, కడప జిల్లాకు చెందినవారు.