సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లిలో బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటించారు. వీర్నపల్లిలో రూ. 40 లక్షలతో చెరువు మరమ్మతు పనులు, రూ. 25 లక్షలతో గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాల గురించి మాట్లాడుతానని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. రాజకీయాలకతీతంగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి చేరామని పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా ప్రస్తుతం 24 గంటల కరెంట్ ఇస్తుంటే భూగర్బజలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయని రైతులు అంటున్నారని తెలిపారు. రైతుల మనోభావాలకు అనుగుణంగా ఎన్నిగంటలు కరెంట్ కావాలంటే అన్ని గంటలు సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులు తమ మోటార్లకు ఆటోమెటిక్ స్టార్టర్లు తొలగించాలని మంత్రి సూచించారు.