పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. కనీసం తెలుగు రాష్ట్రాల వరకైనా వర్గీకరణకు అవకాశం కల్పించాలని, లేకుంటే బీజేపీకి వ్యతిరేకంగా ఇంటింటికీ ప్రచారం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాదిగ జేఏసీ, టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రవి పాల్గొన్నారు. మాదిగలను ఉపయోగించుకుని వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అవుతున్నారని, మాదిగలను బీజేపీ ఓటు బ్యాంకుగా చూస్తోందని విమర్శించారు. బీజేపీ దళితులపై దాడులు, హత్యలకు పాల్పడుతోందని రవి మండిపడ్డారు.