తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారానికి అన్ని వర్గాల నుండి అపూర్వ స్పందన వస్తోందని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములవుతున్నారని తెలిపారు. హైదరాబాద్ గోపన్ పల్లిలోని బ్రాహ్మణ పరిషత్ సదన్ ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్యే గాంధీతో కలిసి మొక్కలు నాటారు. హరితహారంలో ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించామని మంత్రి జోగు రామన్న చెప్పారు. అటవీ ప్రాంతంలో వంద కోట్ల మొక్కలు, హెచ్ఎండీఏ-జీహెచ్ఎంసీ ఏరియాలో నూట ఇరవై కోట్ల మొక్కలు నాటుతామని తెలిపారు.