వాషింగ్టన్: అమెరికన్లు ఉత్తరకొరియా వెళ్లడంపై నిషేధం విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబరు 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానున్నట్లు యూఎస్ అధికారులు వెల్లడించారు. ఉ.కొరియా వెళ్లిన అమెరికన్లు కొందరు అక్కడ అరెస్టు అయి.. ఎక్కువ కాలం జైళ్లలో ఉండిపోవాల్సి వస్తుంది. జైల్లో ఉంటున్న అమెరికన్లకు భద్రత లేదు అందుకే ఉ.కొరియా వెళ్లకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఈ నిషేధం నుంచి కొన్ని పరిస్థితుల వల్ల ఉ.కొరియా వెళ్లాల్సి వచ్చే పాత్రికేయులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ నిషేధం సంవత్సరం పాటు అమల్లో ఉంటుందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ తెలిపారు.
ఉత్తరకొరియాలో పర్యటించేందుకు వెళ్లిన 22ఏళ్ల అమెరికన్ విద్యార్థి వాంబియర్ ఓట్టోపై కేసు పెట్టి 18నెలల పాటు ప్యాంగ్యాంగ్‌లోని జైలులో పెట్టారు. ఆ తర్వాత అతడిని జైలు నుంచి విడిచిపెట్టగా.. బయటికి వచ్చిన వారం రోజులకే ఓట్టో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉ.కొరియా క్రూరంగా వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.