హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ శాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపివేయాలని, నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. రాష్ట్ర విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 20,903 మంది కాంట్రాక్టు ఉద్యోగులను జూలై నెలాఖరులో తెలంగాణ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 23,667 మంది విద్యుత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 20,903 మంది అర్హులని దరఖాస్తుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీలు నిర్ధారించాయి. తెలంగాణ స్థానికత లేకపోవడం, వయోపరిమితి మీరిపోవడం, ఉద్యోగాన్ని మధ్యలో వదిలేయడం వంటి కారణాలతో మిగిలినవారి దరఖాస్తులను తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో పలువురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.