న్యూఢిల్లీ: తెలంగాణ సంక్షేమ పథకాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించాలని ఇవాళ లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ లాంటి ప్రాజెక్టులపై జీఎస్టీ ప్రభావం పడుతోందని తెలంగాణ ఎంపీలు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు పన్ను మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంపీలంతా నినాదాలు చేశారు. అయితే ఈ అంశంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకోవడంతో టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసనను ఆపేశారు. తెలంగాణ సంక్షేమ పథకాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించే అంశాలను జీఎస్టీ మండలి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు జైట్లీ స్పష్టం చేశారు. మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలకు జీఎస్టీ ఎత్తివేయాలని, 18 శాతం పన్ను వల్ల ప్రాజెక్టులు స్తంభించాయని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఆర్థిక ప్రభావం వల్ల ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయని, సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజల కోసమే అని, 18 శాతం జీఎస్టీ వల్ల రాష్ట్రంపై అదనపు భారం పడుతున్నదని జితేందర్ రెడ్డి తెలిపారు. ఇదే అంశం గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీలకు లేఖలు కూడా రాసినట్లు ఆయన గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa