మేడ్చల్ జిల్లాకు వచ్చే ఏడాది జూన్ నాటికి గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. జిల్లాలోని 374 చెరువులను గోదావరి జలాలతో నింపుతామని హామీ ఇచ్చారు. శామీర్‌పేట మండలం మూడుచింతలపల్లి గ్రామసభలో సీఎం కేసీఆర్ పాల్గొని.. గ్రామాభివృద్ధికి కావాల్సిన పనులపై చర్చించారు. 1969 ఉద్యమకారులు వెంకట్రామిరెడ్డి, వీరారెడ్డి పుట్టిన గడ్డ మూడుచింతలపల్లి అని సీఎం తెలిపారు. ఇలాంటి గడ్డను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీరారెడ్డి పేరుతో గ్రామంలో ప్రాథమిక వైద్యశాలను ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లోనే వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వచ్చి వైద్యశాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆరు నెలల్లోనే వైద్యశాల పూర్తి కావాలన్నారు.అటు మూడుచింతలపల్లి గ్రామానికి 100 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. రూ. 75 లక్షలతో విలేజ్ కమ్యూనిటీ హాల్, రూ. 30 లక్షలతో మహిళా సంఘాల కోసం భవనం నిర్మిస్తామని చెప్పారు. మూడుచింతలపల్లి నుంచి చీకటిమామిడి వరకు డబుల్ రోడ్డు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ గ్రామం నుంచి యాదాద్రి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామంలో మోరీల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. దోబీఘాట్, శ్మశానవాటికను నిర్మిస్తామన్నారు. యువకులకు ఆట స్థలం కేటాయించడంలో జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారని తెలిపారు. మూడుచింతలపల్లి నుంచి లక్ష్మాపూర్ వెళ్లే దారిలో మినీ స్టేడియం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మూడుచింతలపల్లికి రేపు సాయంత్రంలోపు ఐదు ట్రాన్స్‌ఫార్మర్లను తీసుకువస్తామన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన జీవోలను రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.కేశవరం, లక్ష్మాపూర్, మూడుచింతలపల్లి గ్రామాలతో సహా 6 గ్రామాలకు ప్రత్యేని నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామాల అభివృద్ధికి జిల్లా కలెక్టర్ వద్ద రూ. 5 కోట్లు ప్రత్యేక నిధి ఉంచుతామని చెప్పారు. లింగాపూర్ తండాను ఎన్నికల నాటికి గ్రామపంచాయతీగా మారుస్తామని చెప్పారు. ఆగస్టు 15 తర్వాత గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను తెలుసుకుంటానని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa