ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ముదిరాజ్ మహాసభకు హాజరైన ఈటెల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2017, 06:00 PM

అన్ని వర్గాలను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడిప్పుడే వాటి ఫలితాలు అందుతున్నాయని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఏర్పాటు చేసిన హైదరాబాద్ తొలి మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ 124 జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా  హాజరయ్యారు. రాష్ట్రం వచ్చిన తర్వాత అన్నిటికంటే ముందే ప్రభుత్వం ముదిరాజుల కోసం కొన్ని పనులు చేపట్టిందని మంత్రి గుర్తుచేశారు.  కృష్ణస్వామి మహోన్నతమైన వ్యక్తి అని మంత్రి ఈటెల అన్నారు. ఆ కాలంలో చదువు లేని స్థితిలో కూడా విదేశీ భాషలలో పట్టు సంపాదించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తమ లాంటివాళ్ళు వ్యక్తులుగా సహాయం చెయ్యకపోవచ్చు కానీ జాతి కోసం తపించేవాళ్ళమని చెప్పారు. సమాజాన్ని అర్ధం చేసుకుని, అన్ని కులాలను గౌరవించడం ద్వారా ముందుండి నడుస్తున్నామని అన్నారు.  హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైన కృష్ణస్వామి విగ్రహాన్ని పెట్టడానికి తన వంతు సహాయం చేస్తానని మంత్రి ఈటెల ప్రకటించారు. చోడి బజార్ లో కూడా విగ్రహం ఏర్పాటు చేద్దామన్నారు. ముదిరాజ్ భవన్ కు 10 ఎకరాల స్థలం కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మనం పొద్దుపొడిచే దగ్గర ఉన్నామని ముదిరాజ్ లను ఉద్దేశించి మంత్రి అభివర్ణించారు. ముదిరాజ్ లు శక్తిగా మారకుండా పార్టీలు, జెండాల పేరిట వెనుకబడ్డ మాట వాస్తవమేనని ఈటెల అభిప్రాయపడ్డారు. ఈ మధ్య కాలంలో అందరు కలిసి ముందుకు పోవడం సంతోషకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు అందరికి సొసైటీల్లో సభ్యత్వం వచ్చేలా చేశామని చెప్పారు. న్యాయపరమైన పోరాటం చేద్దాం.. రాజకీయంగా కూడా పోరాటం చేద్దామని అన్నారు. డబ్బులు ఉంటేనే రాజకీయంగా ఎదుగుతామనే అభిప్రాయం తప్పని, సంకల్పం ఉంటే ప్రజల మన్ననలు పొంది ఎదగవచ్చని మంత్రి ఈటెల అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa