తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇందులో భాగంగానే వరంగల్ నగరానికి హెల్త్ యూనివర్శిటీ, పాస్‌పోర్టు సేవా కేంద్రం, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, అగ్రి కళాశాల, వెటర్నరీ కళాశాల, సైనిక్ స్కూల్ ఇలా ఇనేక సౌకర్యాలు కల్పించారన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని హన్మకొండలోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వరంగల్‌ను ఐటీ హబ్, ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు విద్యాసంస్థలు, ఐటీ సంస్థలను ఇక్కటికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజలే కేంద్ర బిందువుగా వారి సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా సుపరిపాలన సాగుతోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులకు జోహార్లు అర్పించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి ప్రతిఒక్కరూ తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు.
కరీంనగర్ పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. జాతీయజెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు వచ్చే డిసెంబర్‌లోగా అనుసంధానం పూర్తిచేసి సాగునీటి కొరత లేకుండా చేస్తామన్నారు. అనంతరం 18 మంది స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొని జెండావిష్కరణ చేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించారు. ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి జోగు రామన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ బుద్ధ ప్రకాశ్ ఎం.జ్యోతి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక, ఎస్పీ శ్రీనివాస్, బోథ్ శాసనసభ్యుడు రాఠోడ్ బాపురావ్‌తో కలిసి ఆయన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
పాలమూరు సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా భీమ, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ ఖరీఫ్‌లో కొత్తగా 2లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌లోని పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు. మిషన్ భగీరథ పథకాన్ని డిసెంబర్ నాటికి పూర్తిచేసి ఇంటింటికీ నీరందిస్తామని మంత్రి తెలిపారు.
నాగర్‌కర్నూలు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 4.60లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావడానికి రూ.37,800కోట్ల వ్యయంతో పథకాలు రూపొందించినట్లు చెప్పారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా విలసిల్లుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa