మళ్లీ ధరల మోతమోగింది. గడిచిన కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టిన పలు ఆహార పదార్థాల ధరలు భగ్గుమనడంతో ద్రవ్యోల్బణ గణాంకాలు ఎగువముఖం పట్టాయి. జూలై నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ 2.36 శాతంగా నమోదైంది. చక్కెర, మిఠాయి, పాన్, తంబాకు, మత్తుపదార్థాలు ప్రియంకావడంతో గడిచిన నెలలో రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ పుంజుకోవడానికి కారణమైందని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం -0.29 శాతంగా నమోదవడం విశేషం. జూన్ నెలకుగాను సూచీ -2.12 శాతంగా ఉంది. జూన్ నెలకుగాను విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను 1.46 శాతానికి సవరించింది. జూలైలో చక్కెర, మిఠాయిలు 8.27 శాతం ప్రియమవగా, పాన్, తంబాకు, మత్తుపదార్థాలు 6.39 శాతం చొప్పున అధికమయ్యాయి. గృహ ఖర్చులు 4.98 శాతం చొప్పున పెరుగగా, చమురు, లైట్ సెగ్మెంట్‌కు సంబంధించిన ఉత్పత్తులు 4.86 శాతం బలపడ్డాయి. వీటితోపాటు దుస్తులు, పాదరక్షల ధరలు 4.22 శాతం పెరిగాయి. కానీ పప్పు, ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గాయి. వీటితోపాటు కూరగాయల ధరలు -3.57 శాతం తగ్గగా, కోడిగుడ్లు -2.04 శాతం, సుగంధ ద్రవ్యాలు -1.67 శాతం మేర పతనమయ్యాయి. గ్రామీణ ద్రవ్యోల్బణ గణాంకాలు 2.41 శాతంగా నమోదయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa