మియాపూర్: జీవితాంతం కష్టసుఖాల్లో తోడు నీడగా ఉంటానంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్త కిరాతకుడిగా మారాడు.. పెళ్లయిన నాటినుంచే చిన్న కారణాలతో సూటిపోటి మాటలతో శారీరకంగా, మానసికంగా వేధిస్తూ వచ్చిన ఆ మృగాడు చివరికి భార్యను కడతేర్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో అతడు తీవ్రంగా దాడిచేయడంతో అపస్మారక స్థితికి చేరిన ఆ మహిళ ప్రాణాపాయంనుంచి బయటపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మియాపూర్ ఠాణా పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ సమీపంలోని కొండపల్లి పుష్పశ్రీకి, విజయవాడకి చెందిన బ్రహ్మేశ్వర్రావుతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇతను గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఐటీ ఇంజినీరు. మియాపూర్‌లోని ఫ్రెండ్స్ కాలనీలో భార్యతో కలిసిఉంటున్నాడు.
వీరికి పిల్లలు లేరు. పెళ్లయిన కొద్దిరోజుల నుంచి భార్యని పలు రకాలుగా వేధింపులకి గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. మంగళవారం రాత్రి బ్రహ్మేశ్వరరావు భార్యని తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ స్థితిలో కూడా ఆమెను ఇంటి బయట ఉంచి ఫ్లాట్‌కు తాళం వేసి వెళ్లిపోయాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు నగరంలోని బాధితురాలి బంధువులకి తెలిపారు. అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పుష్పశ్రీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఎస్‌ఐ అప్పారావు తెలిపారు. ఆమె తండ్రి మోహన్‌శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్రహ్మేశ్వర్రావుపై వేధింపులతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa