హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నుంచి నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 18, 19, 20వ తేదీల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. అన్ని జిల్లాలపై వర్షం కురిసే ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 12 సెం.మీటర్ల నుంచి 20 సెం.మీటర్ల వరకు కురిసే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగం ఇంఛార్జి సంచాలకుడు వైకే రెడ్డి ‘ఈనాడు’కు వివరించారు. మరోవైపు గురువారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. బయ్యారంలో 4 సెం.మీటర్లు, మహబూబాబాద్, బోనకల్లలో 3, పాల్వంచ, భీందేవరపల్లి, మణుగూరు, పాలకుర్తి, టేకులపల్లి, మహేశ్వరంలలో 2 సెం.మీటర్లు, ఇల్లందు, కొత్తగూడెం ప్రాంతాల్లో 1 సెం.మీ. వర్షపాతం నమోదయింది.