వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ విధానంపై ఓ స్పష్టత ఇచ్చారు. ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే ఇండియాలాంటి ప్రతిభావంతులున్న దేశాలకు లబ్ధి చేకూరనుంది. తన ప్రసంగంలో భాగంగా ఇమ్మిగ్రేషన్ విధానంపై స్పందిస్తూ.. కెనడా, ఆస్ట్రేలియాలాంటి దేశాలు మెరిట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి వ్యవస్థ వల్ల ఎన్నో డాలర్ల వ్యయం ఆదా అవుతుందని, ఉద్యోగులు జీతాలు కూడా పెరుగుతాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన మాటలను గుర్తుచేశారు. ఆయన చెప్పింది నిజమేనని, లింకన్ మాటలను ఆచరించాల్సిన అవసరం ఉందని ట్రంప్ స్పష్టంచేశారు. ప్రస్తుతం ఉన్న తక్కువ నైపుణ్యం గల ఇమ్మిగ్రేషన్ విధానం నుంచి ప్రతిభ ఆధారిత విధానానికి మారితే ఎంతో ఖర్చు ఆదా అవుతుంది. దీని వల్ల ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. వలస కుటుంబాల బాధలు తీరుతాయి. వాళ్లు మధ్యతరగతి వర్గంలోకి వస్తారు అని ట్రంప్ అన్నారు. అమెరికా వదిలి వెళ్లిన లక్షలాది ఉద్యోగాలను తిరిగి తీసుకొస్తానని స్పష్టంచేశారు. అమెరికన్లకు ఉద్యోగాలు, జీతాలు పెంచడమే లక్ష్యంగా ముందుకువెళ్తే ఇమ్మిగ్రేషన్ విధానంలో సానుకూల సంస్కరణలు సాధ్యమేనని తాను నమ్ముతున్నట్లు ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa