ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుర్రపు స్వారీ చేయాలనివుంది!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 01:24 PM

స్టార్‌, ఇమేజ్‌, సెలబ్రెటీ అనే మాటల్ని ఇంకా నా చెవిన ఎక్కించుకోలేదు. రకుల్‌ ఇది వరకు ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది. మరో నాలుగు మెట్లెక్కినా నా అడుగులు మాత్రం భూమ్మీదే ఉంటాయటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. టాలీవుడ్‌లో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే కథానాయిక రకుల్‌. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎలాంటి పాత్ర వచ్చినా ఒప్పుకొంటుంది. అందుకే యేడాదికి నాలుగైదు సినిమాల్ని తన ఖాతాలో వేసుకొంటోంది.
‘విన్నర్‌’ చిత్రానికి వస్తున్న స్పందన ఏంటి? 


ఇదో కమర్షియల్‌ సినిమా. ఎవరికి ఏంకావాలో అవన్నీ అందించే ప్రయత్నం చేశాం. యువతరానికి బాగా నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
కాస్త డివైడ్‌ టాక్‌ వస్తున్నట్టుంది కదా? 


వసూళ్లు చాలా బాగున్నాయి. సాయిధరమ్‌తేజ్‌ కెరీర్‌లో ఇవే మంచి ఓపెనింగ్స్‌ అంటున్నారు. టాక్‌ మెల్లిమెల్లిగా సర్దుకుంటుందన్న నమ్మకం ఉంది.
వరుసగా మెగా కథానాయకులతోనే చేస్తున్నారు.. మెగా హీరోయిన్‌ అనిపించుకోవాలనా? 


ఓ సినిమాకి ఒప్పుకొన్నప్పుడు హీరో ఎవరు? అనేదానికంటే అందులో కథేమిటి? నా పాత్రేమిటి? అనే విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. అఫ్‌కోర్స్‌.. మెగా హీరోలతో నటించడం లక్కీనే. అయితే ఆ ముద్ర కోరుకోవడం లేదు.
తొలిసారి అథ్లెట్‌ పాత్రలో నటించారు.. ఎలావుంది అనుభవం? 


కమర్షియల్‌ సినిమాల్లో కథానాయిక పాత్రకి పెద్దగా ప్రాధాన్యం ఉండదంటుంటారు. కానీ.. ఈ కథకు కీలకమైన మలుపు నా పాత్ర ద్వారే వస్తుంది. కాబట్టి.. నాకు విభిన్నమైన పాత్రే అని చెప్పాలి. దానికి తోడు స్పోర్ట్స్‌ ఉమెన్‌గా కనిపించాలని ఎప్పటి నుంచో కోరిక. ‘మేరీకోమ్‌’లాంటి కథలు నాకు ఎలాగూ రావు. ఆ పాత్రల్ని చేసే స్థాయికి ఇంకా చేరుకోలేదు. రెగ్యులర్‌గా చేసే ‘గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌’లాంటి పాత్రల మధ్య నిజంగానే సితార పాత్ర గొప్ప సంతృప్తి నిచ్చింది.
అథ్లెట్‌లా కనిపించడానికి ప్రత్యేక కసరత్తులు చేసేవారా? 


ప్రత్యేకంగా ఏం చేయలేదు. ఎందుకంటే నేనెప్పుడూ ఫిట్‌గానే ఉంటా. జిమ్‌కి వెళ్తుంటా కాబట్టి... రన్నింగ్‌తో నాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవ్వలేదు. కానీ ఆ షాట్స్‌ తీసేటప్పుడు ఆ సెట్లో నాలుగైదు రౌండ్లు పరిగెట్టేదాన్ని. ఉదయం నుంచి సాయింత్రం వరకూ నీళ్లు తీసుకోలేదు. మధ్యమధ్యలో పుచ్చకాయ ముక్కలు తినేదాన్నంతే. ‘ధృవ’లో ‘పరేషానురా’ పాట కోసం కూడా ఇలాంటి కసరత్తే చేశా.


ఇంతకీ మీ జిమ్‌ ఎలా ఉంది? 


సూపర్బ్‌గా ఉంది. ఇటీవల తొలి వార్షికోత్సవం జరుపుకొన్నాం. విశాఖపట్నంలోనూ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నా.
ఇటు సినిమాలూ అటు వ్యాపారం అంటే ఖాళీ ఉంటుందా? 


టైమ్‌ లేదు.. అనే మాటని నేను అస్సలు నమ్మను. ఎంత పనిచేసినా.. ఇంకా చాలా టైమ్‌ మిగిలే ఉంటుంది. ఇప్పుడు మరో పది పనులు అప్పగించినా చేసేసేంత తీరిక ఉంది. దానికి తోడు మా తమ్ముడే జిమ్‌కి సంబంధించిన బాధ్యతలు చూసుకొంటున్నాడు. తన వల్ల నా శ్రమ కొంచెం తగ్గింది.
మీ తమ్ముడ్ని హీరో చేస్తానన్నారు.. 


అన్నా.. కానీ అందుకు తగిన సమయం రావాలి కదా? వాడికి కూడా ఇప్పటికిప్పుడు మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకు వచ్చేయాలి అనేంత తొందర లేదు.
సినిమాల హడావుడి వల్ల ఇంటికి దూరం అవుతున్న ఫీలింగ్‌ ఉందా? 


ఏ మాత్రం లేదు. ఎందుకంటే నాతో నా తమ్ముడు ఉంటాడు. అమ్మ, నాన్నలు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు హైదరాబాద్‌ వచ్చేస్తుంటారు. స్నేహితులతో నేను రెగ్యులర్‌గా టచ్‌లోనే ఉంటా.
మీరు మంచి భోజన ప్రియులు అట.. 


అవును. హైదరాబాద్‌లో కొత్తగా రెస్టారెంట్‌ పెడితే.. అందులో ఏ వంటకం ఎలా ఉందో రుచి చూసేయాల్సిందే. ఆదివారం నా మెనూ కార్డు పూర్తిగా మారిపోతుంది. ఆరోజు కచ్చితంగా బఫే సదుపాయం ఉన్న రెస్టారెంట్‌కి వెళ్తా. నా ముందు కనీసం అరవై వంటకాలన్నా సిద్ధంగా ఉండాలి. అన్నీ కొంచెం కొంచెం రుచి చూడాల్సిందే. ఈలానే ఓసారి ఓ రెస్టారెంట్‌కి వెళ్లి బుక్‌ అయిపోయా. అక్కడ బఫే ఉందనుకొంటే.. లేదు. దాంతో చాలా నిరుత్సాహపడిపోయా. నన్ను అలా చూసి నా ఫ్రెండ్స్‌ కూడా బాధపడిపోయారు. వాళ్లే ఒకొక్కరూ రెండు మూడు ఐటెమ్స్‌ ఆర్డరు చెప్పి, అన్నింటినీ ఒకే టెబుల్‌ మీద పెట్టారు. దాంతో.. అది కూడా బఫేలానే భావించి ఐటెమ్స్‌ అన్నీ రుచి చూసేశా.
నిర్మాతగా మారాలని ఒక్కసారైనా అనిపించిందా? 


నిర్మాణం అనేది కూడా సినిమాల్లో భాగమే కదా, అదీ ఓసారి ట్రై చేద్దాం.. అనుకొన్నా. అయితే నా స్నేహితులు, శ్రేయోభిలాషులు మాత్రం ‘నువ్వేమైనా చేయ్‌.. కానీ ప్రొడ్యూసర్‌ మాత్రం అవ్వొద్దు’ అని హెచ్చరించారు. వాళ్లంతా నా శ్రేయస్సు కోరుకొనేవాళ్లే. కచ్చితంగా నా మంచి కోసమే చెప్పుంటారు. అందుకే... ఆ ప్రయత్నాన్ని మానుకొన్నా.
ఈ తరహా పాత్రలు చేయాలి.. అంటూ లిస్టేమైనా ఉందా? 


నేను చేసినవి ఎన్ని పాత్రలని? నా ప్రయాణం ఈ మధ్యే మొదలైంది. కాబట్టి.. డ్రీమ్‌ క్యారెక్టర్ల లిస్టు పెద్దదే ఉంటుంది. నాకు గుర్రపు స్వారీ అంటే ఇష్టం. లైట్‌గా వచ్చు కూడా. ‘విన్నర్‌’లో తేజూ గుర్రపు స్వారీ చేస్తుంటే... నాక్కూడా ఆ తరహా పాత్ర దక్కితే బాగుణ్ణు అనిపించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com