సంక్షేమ రంగానికి 46 వేల కోట్లు కేటాయింపు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు అదనంగా 15 శాతం నిధులు
బడ్జెట్‌కు తుదిరూపం ఇచ్చిన సిఎం కేసీఆర్, ఆర్ధికమంత్రి ఈటల
అన్ని వర్గాలకు మేలు చేసేవిధంగా నాలుగొవ వార్షిక బడ్జెట్
హైదరాబాద్, మేజర్‌న్యూస్: అభివృద్ధి, సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ టీఆర్‌ఎస్ సర్కార్ నాల్గవ వార్షిక బడ్జెట్‌కు తుదిరూపం ఇచ్చింది. ఈసారి సంక్షేమ పథకాలకు రూ.46,000 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌లకు కలిపి 15 శాతం నిధులను అదనంగా ఇవ్వనున్నట్లు సమాచారం. మార్చి రెండవవారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్, ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్‌కు ఒక రూపాన్ని ఇచ్చేందుకు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. శాఖల వారీగా, అంశాల వారీగా దేనికెంత కేటాయింపులు చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి ఇప్పటికే ఆర్ధికమంత్రికి, అధికారులకు స్పష్టమైన దిశా, నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. . రాష్ట్రంలో 32 ప్రభుత్వ శాఖలు, దాదాపు 190 విభాగాల అధిపతుల నుంచి వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలను వడపోయడానికి కేసీఆర్ స్వయంగా భారీ కసరత్తు జరిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్‌కు తుదిరూపు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు లేకుండా కొత్త తరహాలో రూపుదిద్దుకుంటున్న 2017-18 సంవత్సరం బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రగతి పద్దు, నిర్వహణ పద్దు అనే రెండు విభాగాలుగా ఉండే బడ్జెట్లో ప్రగతి పద్దులో అణగారిన, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నట్లు చెప్పారు. ఈ మేరకు విద్య, వైద్యం, ఆరోగ్యంతోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపులను మరింత పెంచుతున్నట్లు వెల్లడించారు. విద్య, వైద్యం, ఇతర సంక్షేమపథకాలకు ప్రభుత్వం దాదాపు ప్రస్తుతం రూ.36 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా, ఈసారి దాదాపు 10 వేల కోట్ల రూపాయల వరకు పెంచే అవకాశాలున్నాయని, దీంతో రూ.46 వేల కోట్లకు ఈమొత్తం చేరుకోవచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు కొంతవరకు కేటాయింపులు తగ్గించి సంక్షేమ కార్యక్రమాలకు వాటా పెంచినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా ఒంటరి మహిళలకు నెలకు రూ.1,000 జీవనభృతి కల్పించేందుకు ఈబడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీల) సంక్షేమానికి రూ.వేయి కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీసీలకు, కులవృత్తులకు, చేతివృత్తులకు బడ్జెట్ కేటాయింపుల్లో అధికర ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌కు అధిక కేటాయింపులు : బడ్జెట్‌లోని ప్రగతి పద్దులో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు బదులు ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను చేరుస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద మొత్తం బడ్జెట్‌లో 16 శాతం, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద 9.28 శాతం నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో రెండు ఉపప్రణాళికల కింద రూ.16,500 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. కొత్త బడ్జెట్‌లో ఈ నిధులు కూడా పెరుగనున్నా యన్నారు. కనీసం 15 శాతం పెరుగుదల ఉంటుందని సమాచారం. మరోవైపు, ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద ఖర్చు కాని నిధుల మొత్తాన్ని తర్వాత సంవత్సరానికి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa