ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి చేసుకున్నవిరాట్‌, అనుష్క

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2017, 08:44 AM

కోహ్లి వెంట అనుష్క.. ఇది ఇకపై వార్తే కాదు! వాళ్లిద్దరూ కలిసి కనిపిస్తే ఇక ఆశ్చర్యాలేమీ లేవు! ఇందులో వివాదాలకూ తావు లేదు! ఎందుకంటే ఇప్పుడు వాళ్లిద్దరూ కేవలం ప్రేమికులు కాదు.. వివాహ బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు. ఇక వారి బంధం అధికారికం. నాలుగేళ్ల ప్రేమ ప్రయాణానికి సార్థకత చేకూరుస్తూ.. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు, ఉత్కంఠకు తెరదించుతూ.. విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ పెళ్లి చేసుకున్నారు. దేశానికి దూరంగా.. హడావుడి లేకుండా.. ఇటలీలో కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, అత్యంత   సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది ఈ జోడీ. డిసెంబరు 12న, మంగళవారం విరాట్‌అనుష్క పెళ్లి అంటూ వారం  రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. ఒక్క రోజు ముందే, సోమవారం ఈ జంట ఒక్కటైంది. ఉదయం పెళ్లి జరగ్గా.. రాత్రి  తమ పెళ్లిపై ఉమ్మడిగా అధికారిక ప్రకటనను, ఫొటోలను విడుదల చేశారు విరాట్‌, అనుష్క. 


ఎప్పటికీ ప్రేమ బంధంలోనే ఉంటామని ఈ రోజు మేమిద్దరం ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నాం. ఈ సమాచారాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతుతో ఈ అందమైన రోజు మరింత ప్రత్యేకంగా మారుతుంది. మా ప్రయాణంలో ముఖ్యమైన భాగంగా ఉన్నందుకు ధన్యవాదాలు’’


 


 


అనుకున్నదే అయింది. ఊహాగానాలే నిజమయ్యాయి. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న విరాట్‌ కోహ్లి.. ఓ ఇంటివాడయ్యాడు. నాలుగేళ్లుగా తాను ప్రేమిస్తున్న ప్రముఖ బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను అతను పెళ్లాడాడు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో సోమవారం ఉదయం వీరి పెళ్లి జరిగింది. అనంతరం తమ పెళ్లి గురించి వీళ్లిద్దరూ ఉమ్మడిగా ప్రకటించారు. ఆహ్లాదకరంగా ఉన్న పెళ్లి ఫొటోల్ని తమ ట్విటర్‌ పేజీల్లో పంచుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు, పరిమిత సంఖ్యలో బంధువులు, సన్నిహితుల మధ్య హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరిగినట్లు తెలిసింది. కోహ్లి, అనుష్కల పెళ్లి దుస్తుల్ని డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ రూపొందించినట్లు వెల్లడైంది. పెళ్లికి ముందు రోజు వీళ్లిద్దరూ మెహందీ వేడుకలోనూ పాల్గొన్నారు. కొన్ని రోజుల పాటు ఇటలీలోని విహరించబోతున్న కోహ్లి, అనుష్క.. తర్వాత స్వదేశానికి తిరిగొస్తారు. ఇక్కడ వారు రెండు వివాహ విందులు ఇవ్వబోతున్నారు. ముందుగా కోహ్లి సొంతగడ్డ దిల్లీలో 21న విందు ఉంటుంది. తాజ్‌ డిప్లమేటిక్‌ ఎన్‌క్లేవ్‌లోని దర్బార్‌ హాల్‌లో ఈ విందు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దిల్లీలోని రాజకీయ ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యే అవకాశముంది. తర్వాత ముంబయిలో 26న మరో విందు ఉంటుంది. భారత క్రికెటర్లు ఈ నెల 24న శ్రీలంకతో చివరి టీ20 ఆడనున్నారు. క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు ఆ విందులో పాల్గొననున్నారు. అనంతరం కోహ్లి జట్టు కంటే ముందే అనుష్కతో కలిసి దక్షిణాఫ్రికాకు బయల్దేరతాడని సమాచారం. వచ్చే నెల 5న దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌ ఆరంభమవుతుంది. రెండు నెలలు సాగే ఈ పర్యటన ఆసాంతం అనుష్క.. కోహ్లితోనే ఉంటుందా, మధ్యలో స్వదేశానికి వచ్చేస్తుందా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.


కాదంటే ఔననిలే..: నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న కోహ్లి, అనుష్క డిసెంబరులో పెళ్లి చేసుకోబోతున్నారని గత నెలలోనే ఊహాగానాలు మొదలయ్యాయి. భారత జట్టుకు కెప్టెన్‌ అయ్యాక ఏ సిరీస్‌కూ దూరం కాని కోహ్లి.. విశ్రాంతి పేరుతో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లు రెండింటికీ దూరమవడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటలీలో కోహ్లి, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ నాలుగైదు రోజుల కిందటే మీడియాలో కథనాలు రాగా.. అనుష్క ప్రతినిధి ఈ విషయాన్ని ఖండించాడు. అయినా పెళ్లి వార్తలకు తెరపడలేదు. రెండు రోజుల కిందట కోహ్లి, అనుష్క వేర్వేరుగా విదేశాలకు పయనం కావడం, అనుష్క వెంట ఆమె తల్లిదండ్రులు కూడా కనిపించడం.. మరోవైపు విరాట్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఇటలీ పయనమయ్యేందుకు సన్నాహాలు చేసుకున్న సంగతి వెల్లడి కావడంతో.. పెళ్లి ఖాయమన్న నిర్ణయానికి అందరూ వచ్చేశారు. ఐతే పెళ్లి 12న అని అందరూ అనుకుంటుండగా.. ముందు రోజే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది విరాట్‌, అనుష్క జంట.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com