ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే తెలుగు మహాసభల ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2017, 10:38 AM

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలు రేపు ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేదిక పాల్కురికి సోమనాథుడు ప్రాంగణం (ఎల్బీ స్టేడియం)లో బమ్మెర పోతన వేదికపై శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలుగు మహాసభలను ప్రారంభిస్తారు. ఆయన ఎల్బీ స్టేడియానికి చేరుకోగానే పూర్ణకుంభంతో ఆహ్వానం పలుకుతారు. పండితులు వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలతో సభావేదిక వద్దకు ఆహ్వానించిన తర్వాత వేదికపై తెలంగాణ వైభవాన్ని చాటే ముప్ఫై నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. అనంతరం వేదికపైకి అతిథులను ఆహ్వానిస్తారు. జాతీయ గీతం ఆలాపనతో తెలుగు మహాసభ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సరస్వతి స్తోత్రాన్ని నటేశ్వరశర్మ ఆలపిస్తారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి స్వాగతోపన్యాసం చేస్తారు. తెలంగాణ తల్లిని పూలమాలతో అలంకరిస్తారు. తర్వాత బమ్మెర పోతన పద్యాల పఠనం ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత కేవీ రమణాచారి వ్యాఖ్యాతగా వ్యవహరించే సభలో వెంకయ్యనాయుడు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రసంగిస్తారు. అనంతరం అతిథులను సత్కరిస్తారు. ఈ మహాసభలో పాల్గొన్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలను సన్మానిస్తారు. అనంతరం ఎన్ గోపి కవితా పఠనం ఉంటుంది. వెంటనే ఎల్బీ స్టేడియం బయటే పటాకులు పేల్చుతారు. ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ వెలిగే పటాకుల కాంతిని ఆహుతులంతా వీక్షించేలా ఏర్పాటు చేశారు. అనంతరం జాతీయ గీతాలాపనతో సభను ముగిస్తారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com