ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరోజిని నాయుడు వనితా ఫార్మసీ మహిళా విద్యాలయ ద్విదశాబ్ధి వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 12:01 AM

అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యంత చౌకైన మరియు నాణ్యమైన మందులను అందుబాటులోకి తేవలసిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడకుండా, నిబద్ధతతో ఔషధాలను తయారు చేయాలని ఫార్మా ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. నగరంలోని సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ విద్యాలయ ద్విదశాబ్ధి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన 10 మంది విద్యార్థినులకు ఉపరాష్ట్రపతి బంగారు పతకాలను అందజేశారు. 75 సంవత్సరాలుగా 18 విద్యా సంస్థల ద్వారా ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో, విద్యను అందిస్తూ, ముఖ్యంగా మహిళల విద్య మీద దృష్టి పెట్టిన ఎగ్జిబిషన్ సొసైటీ సేవలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణల మీద విద్యార్థులు దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. రోజురోజుకి కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయని, ప్రత్యేకించి జీవనశైలి, ఆహారం, ఒత్తిడి కారణంగా క్యాన్సర్ లాంటి సమస్యలు ముప్పిరి గొంటున్నాయని, వీటిని అధిగమించేందుకు తొలుత ఆహారం, జీవన విధానంలో మార్పు అత్యంత ఆవశ్యకమని తెలిపారు.  
ప్రపంచ వ్యాప్తంగా జెనరిక్ ఔషధాల తయారీలో భారతదేశం అతిపెద్ద సరఫరాదారుగా నిలిచిందని, ఎయిడ్స్ ని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న యాంటీ రెట్రో వైరల్ ఔషధాలను భారతీయ ఫార్మా కంపెనీలు సరఫరా చేస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సరసమైన ధరలకు ఔషధాలు అందించి, ప్రాణాలను కాపాడుతున్న భారతీయ కంపెనీల యెమెన్ సర్వీసులను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. 
జనరిక్ ఔషధాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే వేగాన్ని మరింత పెంచడం మీద దృష్టి పెట్టాలని సూచించిన ఉపరాష్ట్రపతి, గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు, జీవితాన్ని కాపాడే మందులు, వ్యాధి నివారణ టీకాలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విధాన నిర్ణేతలు, ఫార్మా కంపెనీలు దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com