ఏపీలో మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధరలను భారీగా పెంచింది జగన్ సర్కార్. ఐతే ఇప్పుడు తెలంగాణలోనూ లిక్కర్ ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఖజానాను పెంచుకునే క్రమంలో మందుబాబులకు కేసీఆర్ ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మద్యం ధరలను పెంచే దిశగా సర్కార్ కసరత్తలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మద్యం ధరలను ఖరారు చేసే బాధ్యతలను అప్పగించబోతున్నారని ఎక్సైజ్ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నవంబరు 1 నుంచి తెలంగాణలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో మద్యం ధరలను 5నుంచి10 శాతం మేరకు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని ఆమోదిస్తే ప్రభుత్వానికి ఏటా రూ. 1,200 నుంచి 1,700 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ ప్రతిపాదలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే అంశంపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అధికారుల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. త్వరలోనే కేసీఆర్‌ను కలిసి ప్రతిపాదనలను అందజేస్తారని.. అనంతరం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటవుతుందని సమాచారం. ఆ కమిటీ నివేదిక అందించిన వెంటనే మద్యం ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐతే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ బట్టి ధరల సవరణను ప్రకటించే అవకాశముంది.