ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర తర్జనభర్జనలకు లోనవుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించడం.. సమ్మె అంశాన్ని లేబర్ కోర్టుకు నివేదించడంతో ఇరకాటంలో పడిన కార్మిక సంఘాల నేతలు.. సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 46రోజులుగా కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమించే అవకాశముందని సమాచారం. ఒకవేళ సమ్మె విరమించినా కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం నిరాకరిస్తే.. ఏం చేయాలనే దానిపైనా కార్మిక సంఘాల నేతలు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై టీఎంయూ, ఈయూ కార్మిక సంఘాల నేతలలు విడివిడిగా భేటీ అయి చర్చిస్తున్నారు. మొత్తం 97 డిపోల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమై.. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింపుపై తుది ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో చోటుచేసుకున్న 24 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలపైనా కార్మిక నేతల మధ్య చర్చ జరిగింది. కార్మికులు సమ్మె విరమించి.. బేషరతుగా విధుల్లోకి చేరేందుకు ముందుకొస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కార్మికులు విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం రెండు గడువు విధించింది. ఈ డెడ్‌లైన్లకు అప్పట్లో పెద్దగా స్పందన రాని విషయం తెలిసిందే.