హైదరాబాద్ వాసులకు ఇదో హెచ్చరిక. ప్లెక్సీలు కట్టినా.. పోస్టర్లు వేసినా.. వాల్ రైటింగ్స్ రాసినా.. మీకు ఫైన్ పడిపోతుంది. నగరంలో.. కొత్తగా ఈ-ఫైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది జీహెచ్ఎంసీ. ఇందుకోసం.. లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు. నెలరోజుల్లోనే.. కోటిన్నర విలువ చేసే ఫైన్లు వేశాయి బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు. హైదరాబాద్‌ను లివబుల్ సిటీగా ఉంచడానికి.. నగర సౌందర్యాన్ని కాపాడటానికి జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది. గ్రేటర్ పరిధిలో నిబంధనలు అతిక్రమించిన వారికి.. ఈ-ఫైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు అధికారులు. నగరంలో ఇప్పటివరకు విధించిన జరిమానాల స్థానంలో.. కొత్తగా ఈ- ఫైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్. ఒక్కసారి చలాన్ వేస్తే.. దానిని తిరిగి తొలగించే పరిస్థితి ఉండదంటున్నారు అధికారులు. కొందరి వల్ల.. నగరవాసులు ఇబ్బంది పడొద్దనే.. ఫైన్లు వేస్తున్నామని మేయర్ బొంతు రాంమోహన్ తెలిపారు. ముందుగా.. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించిన తర్వాత.. ఫైన్లు వేయడంతో వేగం పెంచుతామన్నారు మేయర్. ఫైన్ల ద్వారా డబ్బులు సంపాదించడం తమ ఉద్దేశ్యం కాదంటోంది జీహెచ్ఎంసీ. పౌరుల్లో మార్పు తీసుకురావటానికే.. ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామంటున్నారు. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అందుబాటులో ఉన్న ఈ యాప్.. వచ్చే జనవరి నుంచి బల్దియా అధికారులకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత.. ఏప్రిల్ నుంచి ప్రజలు ఫిర్యాదు చేసేలా అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు అధికారులు.