బలం. బలగం ఉంది.. అయినా తెలంగాణలో కాంగ్రెస్ అంతర్గత కలహాలతో అవకాశాలను అందుకోలేకపోతుంది. 2018 ముందస్తు ఎన్నికల్లో చేతులారా... తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకుని నిలువునా మునిగారు. 2019లో లోక్‌సభ సీట్లు గెలిచి మళ్లీ ఫామ్ లోకి వచ్చామని సంకేతాలిచ్చారు. ఇప్పుడు.. తెలంగాణలో 50 వేల మంది కార్మికులు చేపట్టిన ఆర్టీసీ సమ్మెను సొమ్ము చేసుకోలేకపోతున్నారు. అందివచ్చిన అధ్బుతమైన అవకాశాన్ని చేజార్చుకోవటం వెనుక ఏమైనా అదృశ్యశక్తులున్నాయా! టీఆర్ ఎస్‌తో ఏమైనా లాలూచీపడ్డారా అనే అనుమానాలు కూడా సగటు కాంగ్రెస్ కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేడర్ లేని బీజేపీ కూడా ఆర్టీసీ సమ్మెతో తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది. అటువంటిది.. రాష్ట్రంలో విపక్షంగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ప్రజల తరపున గొంతుగా నిలవాలనే కనీస ప్రతిపక్ష సూత్రాన్ని మరచినట్టుంది. ముందస్తు ఎన్నికలకు ముందు నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమారెడ్డిని తప్పించాలంటూ కోమటిరెడ్డి సోదరులు పాటపాడుతూ హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చారు. కానీ.. ఉత్తమ్‌కు పార్టీలో ఉన్న పట్టు ఇక్కడ కలిసివచ్చింది. ముందస్తు ఎన్నికల్లో హూజూర్‌నగర్ నుంచి గెలిచారు. కానీ కోదాడలో సతీమణి పద్మావతి ఓటమితో కాస్త మెత్తబడ్డారు. అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా విజయం సాధించి తన సత్తా చాటారు. ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో అక్కడ పోటీ చేసిన పద్మావతి మరోసారి ఓటమి చవిచూడటంతో ఖంగుతిన్నాడు. పైగా 40వేలకు పైగా బారీ మెజార్టీతో టీఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు. ఉత్తమ్ వ్యతిరేకులకు అస్త్రంగా మారింది. ఇప్పుడు పీసీపీ పీఠం కావాలంటూ.. వీహెచ్, పొన్నాల, కోమటి బ్రదర్స్, జానారెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలు హడావుడి చేస్తున్నారు. పార్టీ పదవులు కోసం తలెత్తిన అంతర్గత విబేధాలు.. ఆర్టీసీ సమ్మెలో కాంగ్రెస్‌ను దూరం చేస్తున్నాయనే విమర్శలూ లేకపోలేదు. ఎవరి నాయకత్వంలో తాము పనిచేస్తే క్రేజ్ అంతా వారికే చేరుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ అనుచరులతో ఆర్టీసీ కార్మికులకు సంఘీబావం చెబుతున్నారు. ఇలా కట్టుగా ఉండాల్సిన నేతలు వర్గాలు మారటం.. బీజేపీకు కలసివస్తోంది. కాంగ్రెస్ అంతర్గత కలహాలు హస్తం పతనానికి నాంది పలుకుతుందనే భయం కూడా కరడుగట్టిన కాంగ్రెస్ వాదుల్లో నెలకొంది. మరి దీన్నుంచి బయటపడేందుకు సోనియమ్మ ఎవర్ని దూతగా పంపుతుందో చూడాలి మరీ..??