గచ్చిబౌలి లోని కుక్కల పార్కును మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. దేశంలో మొదటి సారిగా హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కుక్కల పార్కును ఏర్పాటు చేసింది. సందర్శనకు వచ్చిన భోపాల్ సభ్యులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శాలువాతో సత్కరించి ఆహ్వానించారు. పార్కు లోని ఓపెన్ జిమ్, కుక్కల కోసం ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్ తదితర వాటిని బృందం సభ్యులు పరిశీలించారు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో జంతు ప్రేమికులు తమ తమ పెంపుడు కుక్కలతో ఇక్కడికి వచ్చి కాలక్షేపం చేయడం జరుగుతుందని రాగం నాగేందర్ వారికి వివరించారు. కుక్కల పార్కు లో ఏర్పాటు చేసిన వసతుల పట్ల భోపాల్ కార్పొరేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భోపాల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కేవల్ మిశ్రా, దినేష్ యాదవ్, శంకర్ మాకొరియా, మనోజ్ చౌబేయ్, భూపేంద్ర మాలి, సురేంద్ర వాడిక, మహేష్ మక్వాన తో పాటు అధికారులు రోహిత్ యాదవ్, సంజయ్ సోని, జీహెచ్ఎంసీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ వఖిల్ తదితరులు ఉన్నారు.