ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలమూరు వజ్రం ఏ జ్యోతిర్లింగంలో ఉండేదో తెలుసా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2019, 07:34 AM

కార్తీకమాస పుణ్యకాలంలో శివుని లీలలు గురించి తెలుసుకోడం.. శివాభిషేకం , పంచాక్షరీ మంత్రాన్ని జపించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉండటమేకాకుండా గోదావరి జన్మస్థానం దగ్గరలోని ప్రముఖ క్షేత్రం.
మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో నాసిక్ నగరానికి సుమారు 28 కి.మీ. దూరంలో వుంది త్రయంబకేశ్వరం. ఈ వూరు వేద అధ్యయనం వృత్తిగా స్వీకరించిన అధిక బ్రాహ్మణకుటుంబాలు గల వూరని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఈనాటికి యిక్కడ వేద గురుకుల పాఠశాలలు , అష్టాదశ యోగ సాధనా ఆశ్రమాలు , మఠాలు వున్నాయి.
నాసిక్ , త్రయంబకం ప్రదేశాలు సత్యయుగానికి చెందినవని పురాణాలు పేర్కున్నాయి. రామభక్త హానుమాన్ గా పేరుపొందిన ఆంజనేయుని జన్మస్థలం నాసిక్ నగరం నుంచి త్రయంబకం వెళ్లే దారిలో త్రయంబకానికి ఆరు కిలోమీటర్ల ముందు వచ్చే అంజనేరి గ్రామం. త్రయంబకంలో వున్న త్రయంబకేశ్వరుడు జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగంలో శివుడు అగ్ని రూపంలో కొలువై వుంటాడు . దీనికి ఆధారంగా సత్యయుగంలో బ్రహ్మ విష్ణువులకు ఒకానొక సమయంలో ఎవరు గొప్ప అనే విషయమై వాదన చెలరేగగా శివుడు తన ఆది అంతాలను తెలుసుకొమ్మని ఎవరైతే తెలుసుకుంటారో వారే గొప్పని చెప్పి తాను ఆది, అంతం లేని జ్వలిత స్థంభం వలె అవతరిస్తాడు. ఆది తెలుసుకొనేందుకు విష్ణుమూర్తి వరహము వలె భూమిని తొలచి పాతాళం యింకా కిందకు చేరుకొని కూడా ఆది కానరాక వెనుతిరుగుతాడు.
బ్రహ్మ అంతం తెలుసుకొనేందుకు పక్షి అవతారం దాల్చి పైకి పైకి అంతరిక్షానికి చేరుకొని అంతము కానరాక అసత్య మాడదలచి కేతకి పుష్పమును రుజువునకై తనతో తీసుకొని వస్తాడు.. విష్ణుమూర్తి తాను ఆది తెలుసుకొనలేదని సత్యం పలుకగా బ్రహ్మ తాను అంతం కనుగొంటినని దానికి కేతకి పుష్పం సాక్షమని అసత్యము పలుకుతాడు. అందుకు ఆగ్రహించిన శివుడు బ్రహ్మకు భూలోకంలో పూజలందుకునే అర్హత లేకుండునట్లు శపించి విష్ణుమూర్తి కి శివునితో సమానంగా పూజార్హతను కలుగజేస్తాడు.. ఆది అంతం లేని అనంతమైన జ్వలితలింగమే జ్యోతిర్లింగం. విష్ణుమూర్తి కోరిక మేరకు భూలోకంలో 64 ప్రదేశాలలో జ్యోతిర్లింగంగా శివుడు అవతరించినట్లుగా శివపురాణంలో వుంది. వాటిలో పన్నెండింటిని ముఖ్యమైనవిగా ఆదిశంకరులు గుర్తించేరు. వాటిని మనం ద్వాదశ జ్యోతిర్లింగాలని పిలుస్తున్నాం.
సహ్యాద్రి పర్వతశ్రేణులలోని బ్రహ్మగిరి పర్వత పాదాలదగ్గర వున్న పురాతనమైన మందిరం త్రయంబకేశ్వరం. చుట్టూరా ప్రహారీ గోడతో పెద్ద పెద్ద తలుపులతో ముఖ్యద్వారం. లోనికి వెళితే లోపల విశాలమైన ప్రాకారం అందులో శివలింగాలు , సోమరసం నుంచి వచ్చే అభిషేక తీర్థం వచ్చే ప్రదేశం, స్థలవృక్షం, మందిరం నమూనా, మూలవిరాట్టు నమూనాలు వుంటాయి. బిల్వ చెట్టు కోవెల పుష్కరిణిలను దర్శించుకొని చిన్న తలుపు గుండా బయటకి వెళితే అక్కడ ప్రవహిస్తున్న గోదావరిని చూడొచ్చు. అక్కడవున్న లక్ష్మీనారాయణ మందిరం, గోపాలకృష్ణ మందిరం చూసుకుని గాయత్రీదేవి స్వయంభూ విగ్రహం దర్శించుకొని బయటకి వస్తే గోశాలమీదుగా బజారులోంచి ముఖ్యద్వారం చేరుకుంటాం. రద్దీ తక్కువగా వున్న రోజులలో తిరిగి మందిరంలోనికి వెళ్లి మృత్యుంజయ లింగం మొదలయిన లింగాలను దర్శించుకొని ముఖ్యద్వారం గుండా బయటకి రావొచ్చు.
పాండవుల కిరీటం… తెలంగాణ వజ్రం ఇక్కడ ప్రత్యేకత
ప్రతీ సోమవారం మధ్యాహ్నం జరిగే అభిషేకానంతరం నాలుగు నుంచి ఐదు గంటల వరకు వెండి తొడుగుకు వజ్రాలు, పచ్చలు, కెంపులు పొదిగిన బంగారు కిరీటాన్ని అలంకరిస్తారు. ఈ కిరీటం త్రేతాయుగంలో పాండవులు స్వామివారకి సమర్పించుకున్న కానుక. ఇక్కడ మరో వజ్రం గురించి చెప్పుకోవాలి. దీనిని నాసక్ వజ్రం అని వ్యవహరిస్తారు. ఈ వజ్రం త్రయంబకేశ్వరునకు చెందినది. సుమారు 15వ శతాబ్దంలో తెలంగాణాకు చెందిన మహబూబ్‌నగర్‌లో దొరికింది. దీని బరువు సుమారు 90 కేరట్లు, ఫ్లాలెస్ నీలిరంగు వజ్రం, ప్రిన్స్ కట్ దీనిని అప్పటిరాజులు (పేరు లభించలేదు) త్రయంబకేశ్వరునకు కానుకగా ఇచ్చారు. మూడో ఆంగ్లో – మరాఠా యుధ్దానంతరము ఆంగ్లేయులతో చేసుకున్న ఒడంబడిక మేరకు యీ నసక్ వజ్రం ఆంగ్లేయుల చేతిలోకి అక్కడ నుండి ఇంగ్లండ్‌కు తరలించారు. త్రయంబకేశ్వరుని దర్శనానంతరం దక్షిణగంగగా పిలువబడే గోదావరి పుట్టిన చోటికి వెళ్లే దారిమీదుగా బ్రహ్మగిరి చేరుకొని కొండపై నున్న గోముఖాన్ని అందులోంచి బొట్టు బొట్టుగా పడే గోదావరిని దర్శించుకోవచ్చు. ఈ కోవెలలో ముఖ్యంగా కాలసర్పశాంతి , మృత్యుంజయ హోమం, త్రిపిండి విధి, నారాయణ నాగబలి పూజలు జరుపుతారు. నారాయణ నాగబలి పూజ ఈ మందిరంలో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ పూజ మూడురోజులు నిర్వహిస్తారు. అనారోగ్య సమస్యలు, గృహశాంతి, వంశాభివృధ్దికి, నాగదోష నివారణ కోసం ఈ పూజలు చేయించుకుంటారు .
ఈ ప్రదేశానికి దగ్గరలో నాసిక్‌లో చూడదగ్గ ప్రదేశాలు కుశతీర్థం, గోదావరి మాత మందిరం, కపాలేశ్వర మందిరం పంచవటి, సీతాదేవి గుహ, గోరారామ మందిరం, కాలారామ మందిరం ముఖ్యమైనవి. ఈ ప్రదేశం షిర్డీకి నుంచి కూడా వెళ్లవచ్చు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com