ప్రపంచ స్థాయి స్టూడియోలు నగరంలో ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా నాలుగు రోజుల 'జాయ్ ఇండియా' కార్యక్రమం ఆయన చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభమైంది. గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, ఈ స్పోర్ట్స్ వంటి వినోద రంగాల్లో పలు అంశాలపై ఇందులో చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. 50 దేశాల నుంచి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. దాదాపు 30 వేల మంది సందర్శకులు వస్తారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... సినిమా రంగంలోని పోస్ట్ ప్రొడక్షన్ పనికి అంతర్జాతీయ స్థాయిని హైదరాబాద్ అందుకుందని చెప్పారు. వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగంలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోందని తెలిపారు. వీఎఫ్ఎక్స్ కు తలమానికంగా నిలిచే బాహుబలి, ఈగ, మగధీర వంటి చిత్రాలు హైదరాబాద్ లో రూపొందాయని గుర్తు చేశారు.