ప్రియుడి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు సొంత అక్కడ ఇంట్లోనే దొంగతనం చేసిందో యువతి.పైగా ఏమీ ఎరగనట్టు నటించింది. చెల్లెలే కాబట్టి ఆమె కూడా అనుమానించలేదు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో సదరు యువతి నేరాన్ని అంగీకరించక తప్పలేదు. చెల్లెలే దొంగతనం చేసిందని తెలిసి ఆమె అక్క షాక్‌కి గురైంది.
వివరాల్లోకి వెళ్తే.. రామాంతపూర్‌కి చెందిన మెండు ఝాన్సీ(20) బంజారాహిల్స్‌కు చెందిన రాహుల్ (21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రాహుల్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతనికి డబ్బు అవసరం కావడంతో ప్రియురాలి ఝాన్సీకి చెప్పాడు. ఝాన్సీ వద్ద కూడా అంత డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో తెలియలేదు. ఇదే క్రమంలో ఇటీవల ఫిర్జాదీగూడలోని అక్క ఇంటికి ఝాన్సీ వెళ్లింది. అయితే అక్క ఇంట్లో లేని సమయంలో బీరువా నుంచి నగలు దొంగలించి ప్రియుడికి ఇచ్చింది. నగలు పోయాయని గుర్తించిన ఝాన్సీ చెల్లెలిని ఏమాత్రం అనుమానించలేదు.ఝాన్సీ కూడా ఏమీ ఎరగనట్టే నటించింది.
అయితే బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో.. వారు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.విచారణలో భాగంగా ఝాన్సీని విచారించగా నేరం ఒప్పుకుంది. దీంతో తన తోబుట్టువే దొంగతనం చేసిందని తెలిసి అక్క షాక్‌కి గురైంది.