ఆధార్ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI పాస్‌పోర్ట్ కేంద్రాల్లాగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో మొదటి ఆధార్ కేంద్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఏర్పాటు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఆధార్ కేంద్రం విజయవాడలో ఏర్పాటైంది. ఇలా దేశవ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది UIDAI. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 53 నగరాల్లో 114 ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు చేసిన మొదట్లో ప్రతీ మంగళవారం సెలవు ప్రకటించింది UIDAI. అంటే ఆధార్ సేవా కేంద్రాలు కేవలం వారంలో ఆరు రోజులు మాత్రమే సేవలు అందించేవి. ప్రతీ మంగళవారం సెలవు ఉండేది. అయితే ఆధార్ సేవా కేంద్రాలకు ఆధార్ సేవల కోసం వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో వారంలో 7 రోజులు సేవలు అందించాలని నిర్ణయించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా.