ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ కే జనం జేజేలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2020, 04:38 PM

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకు పోతుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నాయకత్వానికే నగర, పట్టణ ఓటర్లు జేజేలు పలికారు. కౌంటింగు సరళి చూస్తే వార్ వన్ సైడ్ అన్న విధంగా టీఆర్ఎస్ ను ప్రజలు ఆదరించారు. నగర, పట్టణ ఓటర్లు చైతన్యంగా ఉంటారని భావించిన వారికి ఓటర్లు షాక్ ఇచ్చారు. తెలంగాణమంతా కేసీఆర్ మయం అన్న విధంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఏర్పడింది.


ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలిచారు. ఏడాదిన్నర కాలం నుంచి రాష్ట్రంలో వరుస ఎన్నికలు జరిగినప్పటికీ ప్రతి ఎన్నికల్లోనూ తమకు ఎదురు లేదన్న రీతిలో టీఆర్ఎస్ పార్టీ బలం చాటుకున్నది. ఆ పార్టీ దాటికి ప్రతిపక్షాలు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈవీఎంలైన.. బ్యాలెట్ అయినా గెలుపు తమదే అన్న రీతిలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారు.


అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లోనూ 54శాతం ఓట్లతో 88 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. అప్పట్లో ఈవీఎంలను మేనేజ్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ దాని తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా నిర్వహించారు. ఆ ఎన్నికల్లోనూ ఓటర్లు టీఆర్ఎస్ కు వన్ సైడ్ తీర్పు ఇచ్చారు. దీన్నిబట్టి బ్యాలెట్, ఈవీఎం ఏదైనా తమ వైపే ప్రజలు అన్న రీతిలో టీఆర్ఎస్ నాయకత్వం సంబురాలు చేసుకుంటున్నారు.


పార్లమెంటు ఎన్నికల్లో కొంత తడబడినప్పటికీ దాని తర్వాత జరిగిన మండల, జిల్లా పరిషత్ లోనూ అన్ని జిల్లా పరిషత్ లను టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లోని లోటును టీఆర్ఎస్ భర్తీ చేసింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, ప్రజలంతా ఏకపక్షంగా ఒకే పార్టీకి ఉన్నారనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే.


ఈ రోజు మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఫలితాలు కూడా ఏకపక్షంగా రావడంతో ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయి. కేసీఆర్ ను తట్టుకునే సాహనం చేయడం కష్టమని తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో దాదాపు 98శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకునే దిశగా టీఆర్ఎస్ దూసుకెళ్లుతున్నది. పూర్తి ఫలితాలు వస్తేగాని స్పష్టత రానున్నది.


120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లల్లో ప్రతిపక్షాలకు సింగిల్ డిజిట్ లో సీట్లు రానున్నాయి. దీన్నిబట్టి రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని పూర్తిగా బలపరుస్తున్నారని తెలుస్తున్నది. ఎన్నికల్లో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిందని ప్రతిపక్షాలు సాకు చెప్పినప్పటికీ వారికి గౌరవమైన స్థానాలు కూడా పొందలేకపోతున్నారు. ఎన్నికల్లో ప్రతి పార్టీ గెలిచేందుకు ఎన్నో మార్గాలను అన్వేషిస్తున్నది. ఇది కొత్తగా టీఆర్ఎస్ పార్టీ చేసిందేమి కాదు.


ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలిచేందుకు అయా పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నది. దీంట్లో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అంతేకానీ ప్రతిపక్షాలు చెబుతున్న సాకులను ప్రజలు పట్టించుకోవడం లేదు. పైగా తెలంగాణలో ప్రత్యామ్నాయమే లేదని ఓటర్లు తీర్పు ఇచ్చారు. ఇలాంటి తీర్పు వల్ల అధికారంలో ఉన్న పార్టీ మోనార్క్ గా మారే అవకాశాలున్నాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఓటర్ల తీర్పే కీలకం. దీన్ని ఎవరూ కాదనలేరు.


పురపోరులో తమ శక్తిని చాటుతామని ఎన్నికల్లోకి దిగిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు మింగుడు పడడం లేదు. సింగిల్ డిజిట్ కే పరిమితమౌతామని కాంగ్రెస్ పెద్దలు కూడా ఊహించలేదు. పోలింగు పూర్తయిన తర్వాత కూడా తమ శక్తి ని చాటుతామని, అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన తమ పార్టీ కార్యకర్తలు సమర్థవంతగా ఎదుర్కున్నారని, గౌరవమైన సీట్లను సాధిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కానీ గౌరవమైన స్థానాలకు చాలా దూరంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పవచ్చు.


తన సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్ ను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాపాడుకోలేకపోయారు. కేవలం రెండు వార్డులకే పరమితమయ్యారు. చావు తప్పి కన్న లొట్ట పోయిందన్నట్లు నేరేడుచర్ల మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకొని పరువు నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలోని నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదని తెలుస్తుంది.


రాష్ట్రంలో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. పీసీసీ పోటీలో ఉన్న మరోనేత రేవంత్ రెడ్డి ఇలాకాలోనూ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఆయన పాత నియోజకవర్గమైన కొడంగల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. కానీ కోస్గి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. మూడు మున్సిపాలిటీల్లో రెండు టీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ కు దక్కింది.


మల్కజీగిరిలో పార్లమెంటు పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రేవంత్ కు మింగుడు పడని ఫలితాలు వచ్చాయి. అయా స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ దక్కించుకున్నది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు దయాకర్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఆయనన్ను బుజ్జగించింది. ఎప్పుడు వార్తల్లో ఉండే రేవంత్ టీఆర్ఎస్ దాటికి చితికిల పడినట్లు తెలుస్తున్నది.


మరో నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన సతీమణిని సంగారెడ్డి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్రి విక్రమార్క ఇలాకాలోనై టీఆర్ ఎస్ జెండా ఎగురవేసింది. మధిర, వైరా మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ కు కంచుకోటగా భావిస్తున్న మధిరలోనూ టీఆర్ఎస్ పాగా వేసింది.


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కూడా భంగపాటు తప్పలేదు. మిగతా నాయకులు హైదరాబాద్ లోని గాంధీభవన్ లోని ప్రెస్ మీట్లు పెట్టి కాలం గడుపుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో చావుదెబ్బ అని చెప్పవచ్చక తప్పదు.కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీని తెలంగాణ ప్రజలు విస్మరించడం లేదు. ఏకంగా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతి నిత్యం ఎక్కుపెట్టి విమర్శలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఈ ఫలితాలు వారి అంచనాలకు దరిదాపుల్లో కూడా లేవని తెలుస్తున్నది. ఇప్పటి వరకూ ఒక్క మున్సిపాలిటీల్లో గెలుపొందింది.


నిజామాబాద్ కార్పొరేషన్ లో పోటాపోటీగా తలపడుతున్నది. తెలంగాణలో తమే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీని ప్రజలు దగ్గరకు రానీవ్వ లేదని తెలుస్తున్నది. తమకు బలమున్న స్థానాల్లో తప్పకుండా గెలుస్తామని బీరాలు పలికిన నేతలకు ఈ ఫలితాలు చూసే సరికి నోట మాట రావడం లేదు.


కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న 370 ఆర్టికల్ రద్దు, రామ జన్మభూమి నిర్మాణం, త్రిపుల్ తలాక్, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ వంటి అంశాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా బీజేపీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ వాటిని ప్రజలు నమ్మలేదని తెలుస్తున్నది.


స్థానిక సమస్యలను పక్కన పెట్టి ఎల్లప్పుడు జాతీయ నాయకత్వం చేసిన పనులు, జాతీయ నాయకుల ఫోటోలను వాడుకునేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం పనిచేస్తుంది. ఈ ఎన్నికల్లో కూడా అదే పద్ధతిని అనుసరించింది. కానీ అంచనాలకు దరిదాపుల్లో కూడా లేకుండా కనుమరుగైంది. ఈ భవిష్యత్ లో టీఆర్ఎస్ పార్టీపైగానీ, కేసీఆర్ నాయకత్వంపైగానీ మాట్లాడే సాహసం చేయకపోవచ్చునని తెలుస్తున్నది.


పార్లమెంటు ఎన్నికల్లో 4 లోక్ సభ సీట్లు గెలిచే సరికి తెలంగాణలోనే జెండా ఎగరవేస్తామని బీజేపీ నాయకులు చెప్పిన మాటలను ఓటర్లు విశ్వసించడం లేదని రెండోసారి రుజువైంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన మండల, జిల్లా పరిషత్ లోనూ ఇవే ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం పునరావృతమయ్యాయి. వారి పార్లమెంటు స్థానాల్లో బీజేపీ కనీస పోటీ ఇవ్వకపోడంతో రాష్టంలో వారి బలమెంతో తెలుసుకోవల్సిన పరిస్థితి తలెత్తనున్నది.


నేల విడిచి సాము చేయడం సరైంది కాదని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తెలుసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు వెలువడిన ఫలితాలు కేసీఆర్ పాలనకు కితాబు అని చెప్పకతప్పదు. ఎవరైనా అంగీకరించాల్సిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com