ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే గొడుగు కిందకు రెవెన్యూ వ్యవస్థ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2020, 07:35 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూశాఖ సంస్కరణలను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. రెవెన్యూ చట్టాన్ని సవరించనున్నట్లు గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే రెవెన్యూ చట్టాలపై ఇప్పటికే అధికారులు సుదీర్ఘంగా అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. మార్చి నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో రెవెన్యూ చట్టాన్ని సవరించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది.
నిజాం సర్కార్ లో 1317 ఫస్లీ చట్టం అమల్లో ఉండేది. ఈ చట్టంలోనే అన్ని రకాల రెవెన్యూ చట్టాలకు ఫస్లీ భూమికగా అమల్లో ఉండేది. రాష్ట్రాల విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్లీ 1317 చట్టాన్ని సవరించి, భూ పరిపాలన అంశాలపై రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీంట్లో సెక్షన్లు, సబ్ సెక్షన్లతో పాటు నియమ, నిబంధనలను చేర్చారు. దీంతో 124 రెవెన్యూ చట్టాలుగా విడదీశారు. దీంతో రెవెన్యూ చట్టం ఇబ్బడిముబ్బడిగా ఏర్పడింది. వీటిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఉత్తర్ ప్రదేశ్ తరహాలో రెవెన్యూ కోడ్ ను తీసుకురావాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన అధ్యయనం చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
యూపీలో 2016వ సంవత్సరం నుంచి రెవెన్యూ కోడ్ అమల్లో ఉంది. దీనివల్ల రెవెన్యూ పరమైన ఇబ్బందులను ఆ ప్రభుత్వం అధిగమించిందని తెలిసింది. ఇదే పద్దతిలో తెలంగాణలోనూ అమలు చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ వ్యవస్థలన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. రెవెన్యూ వ్యవస్థ నిర్వహణ కూడా ఒకే అధికారి నియంత్రణలో ఉండే విధంగా చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో దీన్ని దారిలోకి తీసుకొచ్చేందుకు గత కొంత కాలంగా సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. దీంట్లో భాగంగానే క్షేత్రస్థాయిలో ఉన్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ), విలేజ్ రెవెన్యూ అధికారి (వీఆర్వో) వ్యవస్థను తీసేయనున్నట్లు సమాచారం. వీరిని ఇతర సేవలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వ్యవస్థను రద్దు చేయడం వల్ల న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రతలు తీసుకుంటున్నట్లు తెలిసింది. వీఆర్ఏ, వీఆర్వోలను వేరే ఇతర శాఖలకు పంపించాలా? లేదా రెవెన్యూలోనే వినియోగించుకోవాలా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com