తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. సభలో మెజార్టీ దృష్ట్యా రెండు సీట్లు కూడా టీఆర్ఎస్ ఖాతాలో పడనున్నాయి. అయితే రాజ్యసభ సీట్లకు సంబంధించి టీఆర్ఎస్ నేతల మధ్యనే గట్టి పోటి నెలకొందని తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ రాజ్యసభకు ఎవరిని పంపాలనే దాని పై తీవ్ర కసరత్తు చేస్తున్నారట.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి సీఎం కేసీఆర్ ను కలిశారు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అనంతరం నాయిని నర్సింహ్మా రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను వెళితే ఢిల్లీ వెళుతానని, ఆర్టీసి చైర్మన్ పదవి తనకు అవసరం లేదన్నారు. నాయిని వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
త్వరలోనే నాయిని ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. కొంత కాలంగా నాయిని టీఆర్ఎస్ అధిష్టానం పై అసంతృప్తితో ఉన్నారు. తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డి విషయంలో పార్టీ తనకు అన్యాయం చేసిందనే భావనలో ఆయన ఉన్నారు. సీఎం కేసీఆర్ ను నాయిని కలిసినా కూడా తనకు సీఎం కేసీఆర్ నుంచి ఎటువంటి హామీ లభించలేదట. దీంతో నాయినికి రాజ్యసభ సీటు దక్కడం అనుమానమేనని సమాచారం.
రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి సీఎం కేసీఆర్ మదిలో పలువురు ప్రముఖుల పేర్లతో పాటు తన కూతురు కవిత పేరు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో పార్టీ సీనియర్లు రాజ్యసభ సీటు విషయమై ఒత్తిడి తేవడంతో సీఎం కేసీఆర్ డైలమాలో పడ్డారని తెలుస్తోంది. నాయిని ఏకంగా పోతే ఢిల్లీకి పోతా.. లేకుంటే లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.