మల్కజీగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దిష్టిబొమ్మ తగులబెట్టి నిరసనలు తెలియజేస్తున్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీల్లోనూ టీజేఏసీ విద్యార్థులు నిరసన తెలియజేశారు. కాకతీయ యూనివర్శిటీ రెండో గేటు ముందు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి విద్యార్థులు నిరసన తెలియజేశారు. రేవంత్ రెడ్డిని భేషరత్తుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆయనపై బనాయించిన అక్రమ కేసుల్ని వెంటనే ఉపసహరించుకోవాలని కోరారు.
ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ చట్ట విరుద్ధమని, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక ఎంపీ ని అక్రమంగా అరెస్ట్ చేయడమేమిటని మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ ప్రశ్నించారు. 111 జీఓ పరిధి లో నిర్మాణాలు చేయరాదని నిబంధనలున్నప్పటికీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భూముల్లో అక్రమ నిర్మాణాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. వాటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలపైన ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు. రేవంత్ రెడ్డి పై కేసులను వెంటనే తొలగించి భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎంపీల హక్కులను భంగం కల్గించడం చట్ట విరుద్ధమని, రేవంత్ రెడ్డి అరెస్టు చేసి ఆయన హక్కులకు ప్రభుత్వం భంగం కల్గించిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ అరెస్టుపై పార్లమెంట్ లో చర్చిస్తామని తెలిపారు.
111 జీఓ ను రద్దు చేస్తామని గతంలో కేసీఆర్ అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు. 111 జీఓను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే అక్కడ అక్రమంగా చేసిన నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాలు నడుస్తునపుడు ఎంపీని అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. 111 జీఓ లో మూడంతస్థుల భవనాలను నిర్మించడం అక్రమమని తెలిపారు. రేవంత్ అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు. దీన్ని సీరియస్ గా తీసుకుంటామని, రేవంత్ రెడ్డి రామేశ్వర రావ్ అక్రమ భూముల గురించి వెలికి తీయడంతో కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల భూముల అక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కొకాపేట, మియపూర్ భూములలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని, కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని విమర్శించారు. గోపన్ పల్లి లో రేవంత్ సోదరులు అక్రమాలకు పాల్పడితే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
రంగారెడ్డి జిల్లాలో జరిగిన భూముల అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 111 జీఓ పరిధిలో సామాన్య రైతులు నిర్మాణాలు చేస్తుంటే కూల్చుతున్నారని, కేటీఆర్, మైహోం రామేశ్వర్ రావు బంధువులు వేల కోట్లు రూపాయల అక్రమ ఆస్తులు పొందారని వెల్లడించారు. దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఫార్మా కంపెనీపై కూడా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మూసి నది ఇప్పటికే మురికి నదిగా మారిందన్నారు. కేటీఆర్ చేసింది అక్రమంగా ఉందా లేదా అని ప్రభుత్వమే తేల్చాలన్నారు. భూముల అక్రమణపై అసెంబ్లీ, పార్లమెంట్ ల్లో చర్చిస్తామని హెచ్చరించారు. ఒక ఎంపీ డ్రోన్ కెమెరా వినియోగించారని కేసులు పెట్టడం వింతగా ఉందని, జనం నవ్వుకుంటున్నారని తెలిపారు. ఫార్మా సిటీకి 36 అనుమతులు కావాలని, ఫార్మా సిటీని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగు పడిందని గుర్తు చేశారు.