బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన నెలకొనడం, కరోనా వైరస్ మరిన్ని దేశాలకు విస్తరించడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో బంగారం ధర మళ్లీ రూ.45 వేలు దాటింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పసిడి రూ.770 పెరిగి రూ.45,340కి చేరుకున్నది. గురువారం ధర రూ.44,570 వద్ద ఉన్నది. ఒకవైపు ఈక్విటీలు నేలచూపు చూస్తుండగా, మరోవైపు రూపాయి పతనమవడంతో మదుపరుల తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన బంగారం వైపు తరలించడంతో ధరలు ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ వర్గాలు వెల్లడించాయి. పసిడితోపాటు వెండి మరింత పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి రూ.190 అధికమై రూ.48,180కి చేరుకున్నది. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,678 డాలర్లు పలుకగా, వెండి 17.34 డాలర్లుగా ఉన్నది.