అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం వాస్తవాలకు భిన్నంగా ఉందని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మల్లుభట్టి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ పై గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా లేదన్నారు. నిరుద్యోగ భృతి, సాగునీటి ప్రాజెక్టుల పై క్లారిటీ లేదని ఆరోపించారు. పేదలకు ఇవ్వనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై ఆరేళ్ళ నుంచి ఒకటే మాట చెప్తున్నారని, కానీ ఇళ్ల నిర్మాణం చేపట్టడం లేదన్నారు.
గవర్నర్ ప్రసంగంలో పొడుభూములు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ది నిధుల పై అంకెలు చెప్పలేదని విమర్శించారు. రైతుబంధు-రైతురుణమాఫీ అనేది కేవలం ఎన్నికల ఆయుధాలుగా మారాయని, ఇది దురదృష్టకరమని అన్నారు. మిషన్ భగీరథ నీళ్ల కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వలేదన్నారు.
రాష్ట్రంలో శాంతి, భద్రతల సమస్యలు, మహిళల పై దాడుల నివారణ చర్యలు కనిపించలేదన్నారు. గవర్నర్ ప్రసంగం పసలేకుండానే కాకుండా పుస్తకంలో కూడా క్వాలిటీ లేకుండా ప్రింట్ చేశారని ధ్వజమెత్తారు.
లిక్కర్ పాలసీ, డబుల్ బెడ్ రూమ్, రీడిజైన్ పాలసీ, డ్రింకింగ్ వాటర్ , శానిటేషన్, వర్క్ ప్లాన్స్ పై చర్చ జరగాలని డిమాండ్ చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో టెండర్లు పిలవకుండా నామిషన్ పద్దతిలో రూ.4వేల కోట్ల ప్రాజెక్టు ఇవ్వడం పై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల పై చర్చించాలని, విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో చర్చించడానికి పనిదినాలు పొడిగించాలన్నారు. సీఏఏ, ఎన్నార్సీల పై చర్చ జరగడానికి షార్ట్ చర్చ జరగాలని డిమాండ్ చేశామని వెల్లడించారు.