అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 30 మంది ప్రముఖ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. మొత్తం 20 రంగాల్లో 30 మంది మహిళలకు అవార్డులు ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన వారిలో వ్యవసాయం, సామాజిక సేవ, వ్యాపార, జర్నలిజం, నృత్యం, పెయింటింగ్, విద్య, వైద్య, జానపదం, క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం తదితర రంగాలకు చెందిన మహిళలు ఉన్నారు. జానపద కళారంగంలో మంగ్లీ సత్యవతి, సోషల్ మీడియా విభాగంలో మిల్కూరి గంగవ్వ, వ్యవసాయ రంగంలో బెగారి లక్ష్మమ్మ, జర్నలిజంలో జీ నిర్మల రెడ్డి తో పాటు మరికొందరు అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల వెయిట్ లిఫ్టింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన దీక్షిత, స్విమ్మింగ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన శ్యామల గోలీ అవార్డుకు ఎంపికయ్యారు. ఎంపికైన 30 మంది మహిళలకు ప్రభుత్వం మార్చి 8(అంతర్జాతీయ మహిళా దినోత్సవం)న రూ. 1 లక్ష నగదు రివార్డుతో సత్కరించనుంది.జానపద సవ్వడి..మంగ్లీతన పాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులు దోచుకున్న మంగ్లీ సత్యవతి..గాయనిగా, బుల్లితెర యాంకర్‌గా, నటిగా మనందరికి సుపరిచితురాలు. 'మాటకారి మంగ్లీ' ప్రోగ్రామ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఇప్పటికే పలు చిత్రాల్లో పాటలు పాడారు. మంగ్లీ నాన్న బాలు నాయక్ జానపద పాటలు పాడేవారు.
అలా తండ్రిని చూస్తూ పెరిగిన మంగ్లీకి పాటలంటే ఇష్టం కలిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఉగాది, వినాయక చవితి, బతుకమ్మ, బోనాలు, సమ్మక్క-సారక్క జాతరల సందర్భంగా ఆమె పాటలు పాడి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఇస్మార్ట్ లోకల్' గంగవ్వ..యూట్యూబ్ సంచలనం గంగవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ భాష, యాస, అమాయకమైన చూపులు, లోకల్ పంచ్‌లతో తెలుగు ప్రజలకు దగ్గరైంది.
'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్‌లో గంగవ్వ పాత్రలో ఆమె నటన అద్భుతం. పల్లెటూరి సంస్కృతిని చాటి చెబుతూ ప్రజాదరణ పొందడంతో సినిమాల్లోకి రంగం ప్రవేశం చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్, మల్లేశం చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. గంగవ్వది.. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామం.