తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్లు ఎత్తు నుంచి 2.1 కిలోమీటర్ల మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. 2020, మార్చి 06వ తేదీ శనివారం ఖమ్మం, ములుగు, సూర్యాపేట, భద్రాద్రి, మహబూబాబాద్, యాదాద్రి, నల్గొండ, భువనగిరి, జనగామ, వరంగల్ పట్టణం, వరంగల్ రూరల్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఆదివారం కూడా తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉందన్నారు.
ఇదిలా ఉంటే..రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 2020, మార్చి 05వ తేదీ గురువారం సాయంత్రం వర్షం పడింది. అకాల వర్షం పడడంతో పంటలకు నష్టం వాటిల్లింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రంలో కందులు తడిసిపోయాయి. దాదాపు ఐదు వేల కందుల బస్తాలు నిల్వ ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. పలువురు రైతులు విక్రయించడానికి కందుల బస్తాలను ఇక్కడకు తీసుకొచ్చారు. అధికారుల నిర్లక్ష్యంగానే కందులు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఆదుకోవాలని వారు కోరుతున్నారు.