నగరంలోని బాలానగర్, కేపీహెచ్‌బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. ఈ రెండు వేర్వేరు సంఘటనలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్ లోని గౌతంనగర్ కు చెందిన మంజుల శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఆచూకి తెలియకపోవడంతో మంజుల తల్లి మణి ఫిర్యాదు చేశారని సీఐ ఎండీ వాహిదుద్ధీన్ తెలిపారు. ఇక కేపీహెచ్బీలో ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ అదే ప్రాంతంలోని ఓ ప్రయివేట్ హాస్టల్లో ఉంటున్న రోజా అనే యువతి అదృశ్యమైంది. రోజాకు ఇటీవలే పెళ్లి నిశ్చయమయింది. అయితే తన సోదరికి ఈ నెల 4న ఫోన్ చేసిన రోజా.. నిశ్చితార్థం జరిగిన వ్యక్తితో తనకు పెళ్లి ఇష్టం లేదని.. తాను మరో వ్యక్తిని ఇష్టపడుతున్నట్లు చెప్పి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో రోజా కుటుంబసభ్యులు ఆమె కోసం ఎంత వెతికినా కూడ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు రోజా మిస్సింగ్ పై ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.